
ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మేయర్ సునీల్‌రావు
కరీంనగర్: గుడిసెల దగ్ధం ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. నగరంలోని 42వ డివిజన్ ఆదర్శనగర్‌లో మంగళవారం వడ్డెర కార్మికుల గుడిసెలు కాలిపోగా, బుధవారం ఘటన స్థలాన్ని మేయర్ సునీల్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో కొందరు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. గతంలోనే గుడిసెలు ఖాళీ చేయాలని బాధితులపై కొందరు ఒత్తిడి తీసుకొచ్చారని స్థానికులు చెప్పారని వివరించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి సమస్య వివరిస్తానని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేలా చూస్తామని వెల్లడించారు. కలెక్టర్‌కు ఫోన్ చేసి బాధితులకు సత్వరమే టెంపరరీగా నివాసాలు ఏర్పాటు చేసేలా చూడాలని కోరుతామని తెలిపారు. బాధితులందరికీ కలిపి తక్షణ సాయంగా రూ.లక్ష అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అశోక్‌రావు, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు పొన్నం అనిల్, సీనియర్ నాయకులు గంట శ్రీనివాస్, జక్కుల నాగరాజుయాదవ్, దూలం సంపత్‌గౌడ్, ముధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్