
ఎస్‌ఆర్‌లో ఫోర్జరీగా చెబుతున్న సంతకం
● 1988లో కట్టా చేరే సమయంలో ఫోర్జరీ సంతకాలు ● సర్వీస్ రికార్డులో ఒక్కో పేజీకి ఒక్కో అధికారి సంతకం ● అంతర్గత సిబ్బందే అతనికి సాయం చేశారని సందేహాలు ● తప్పుడు విధానంలో చేరారంటూ నిగ్గుతేల్చిన నివేదిక ● త్వరలోనే వేటు ఖాయమంటున్న సహోద్యోగులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కట్టా విష్ణువర్ధన్ అలియాస్ వాసు.. పంచాయతీరాజ్ విభాగంలో ప్రస్తుతం ఏఈగా కొనసాగుతున్న ఈ ఉద్యోగి నియామకం, విద్యార్హతల విషయంలో ఆయన అందరినీ తప్పుదోవ పట్టించారని ఇంతకాలం అనుకున్నారు. కానీ.. అతని సర్వీసు రికార్డులు చూస్తే.. కట్టా విష్ణువర్ధన్ ఇదంతా బయట నుంచి ఒక్కరే చేయలేదనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతున్న టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీల తరహాలోనే అతనికి పంచాయతీరాజ్ విభాగంలోని కొందరు సిబ్బంది సహకరించారన్న విషయం సర్వీసు రికార్డు చూస్తే అర్థం అవుతోంది. నేటి హైటెక్ యుగంలో ఉద్యోగ నియామకాల్లో అనేక అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. కానీ.. ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే కట్టా విష్ణువద్ధన్ చాలా తెలివిగా తన సర్వీసు రికార్డులో అధికారుల సంతకాల ఫోర్జరీకి వ్యూహం రచించారని అతని సహోద్యోగులు కొత్త సందేహాలను లేవనెత్తుతున్నారు.
రెండు సంతకాలు, రెండు స్టాంపులు..
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. రెండో పేజీలో డీఈ రవికుమార్ సంతకం, సుల్తానాబాద్ సబ్ డివిజన్ స్టాంప్ ఉంది. అదే సమయంలో మరో అధికారి సంతకం, జగిత్యాల సబ్‌డివిజన్ స్టాంప్ ఉంది. ఇంకా పరిశీలించి చూస్తే.. వీటి అడుగున వేములవాడ సబ్ డివిజన్ స్టాంప్ కూడా ఉంది. మొత్తానికి రెండు సంతకాలు మూడు స్టాంపులతో రెండో పేజీని అత్యంత గందరగోళంగా ఉంది. ఈ లెక్కన చూస్తుంటే.. ఈ సంతకాలను ఫోర్జరీ చేసి ఉంటారని, దీనికి సూత్రధారి విష్ణువర్ధన్ అయి ఉంటాడని సహోద్యోగులు అనుమానిస్తున్నారు. తప్పుడు దారిలో కొలువు సాధించి, అనుమానాస్పద విద్యార్హతలతో ఉద్యోగం చేస్తున్న కట్టాకు ఫోర్జరీలు పెద్ద విషయమేమీ కాదని ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన అతని నియామకం సమయంలో కొందరు కీలక ఉద్యోగులు విష్ణువర్ధన్‌కు సహకరించారని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సర్వీసు రికార్డును ఇంతకాలం వీసమెత్తు అనుమానం రాకుండా ఉందని విమర్శిస్తున్నారు.
పట్టుకోండి చూద్దాం పార్ట్–6
ఏం జరిగింది?
కట్టా విష్ణువర్ధన్ ఉరఫ్ వాసు వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది. పంచాయతీ రాజ్ విభాగం వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. కరీంనగర్ సబ్–డివిజన్, ఏఈ, విష్ణువర్ధన్ మార్చి2, 1967లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ టీచర్లే. 1987లో తండ్రి వెంకట నాగరత్నాచారి మరణించారు. తన తల్లి ప్రభుత్వ టీచరు అన్న విషయాన్ని దాచి 1988లో కారుణ్య నియామకం కింద పంచాయతీరాజ్‌లో అప్పటి ఉమ్మడి జిల్లాలోని మహదేవాపూర్‌లో గ్రేడ్–3 వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు. వాస్తవానికి 1984లోనే కట్టా నిరూప ప్రభుత్వ టీచర్‌గా నియమితులయ్యారు. కరీంనగర్ డీఈవో కార్యాలయంలో ఆమె పుట్టిన తేదీ ఫిబ్రవరి 01, 1956గా ఉంది. విచిత్రంగా విష్ణువర్ధన్ తన పదో తరగతి సర్టిఫికెట్లలో మార్చి 2, 1967లో జన్మించినట్లు పేర్కొన్నారు. తల్లి కంటే కేవలం పదేళ్లు చిన్నవాడైన ఉద్యోగిగా అరుదైన రికార్డును తనపేరిట లిఖించుకున్నాడు. అదే సమయంలో గ్రేడ్–3 వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా ఉమ్మడి జిల్లాలోని మహదేవాపూర్‌లో చేరారు. ఈ విషయం తన సర్వీసు రికార్డులోని అతని చేరికను ధ్రువీకరిస్తూ అతనిపై అధికారి తొలిపేజీలో చేసిన సంతకాన్ని చూసి చెప్పొచ్చు. రెండోపేజీలోనూ అదే అధికారి సంతకం ఉండాలి. కానీ, మరో సబ్ డివిజన్ సుల్తానాబాద్‌కు చెందిన డీఈ సంతకం ఉండటంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగింది. నిబంధనల ప్రకారం.. రెండు పేజీల్లోనూ ఒకే అధికారి సంతకం, స్టాంప్ ఉండాలి. ఇక్కడ వేర్వేరు సబ్‌డివిజన్లకు చెందిన డీఈల సంతకాలు ఉన్నాయి. దీన్ని ఉన్నతాధికారులు ఎలా ఆమోదించారో అని మిగిలిన సిబ్బంది ముక్కున వేలేసుకుంటున్నారు.
ఆ సంతకం నాది కాదు
విష్ణువర్ధన్ విద్యార్హతల వివాదం చాలాకాలంగా కొనసాగుతోంది. ఆయన తన సర్వీసులో ఏనాడూ నా వద్ద పనిచేయలేదు. కానీ.. అతని సర్వీసు రికార్డు బుక్‌లో నా సంతకం ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. నూటికి నూరుపాళ్లు అది నా సంతకం కానే కాదు.
– రవి కుమార్, విశ్రాంత పీఆర్ ఇంజినీర్

కట్టా విష్ణువర్ధన్