సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల మోడల్ స్కూల్ మాజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సస్పెండ్ అయినా.. తాను ఉత్తముడిని అంటూ నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా ఉన్న శ్రీనివాస్ మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు విడుదలయ్యాయి. తమను పదేపదే వేధిస్తున్న శ్రీనివాస్ బండారాన్ని లోకానికి తెలిపేందుకు తోటి ఉద్యోగులే రహస్యంగా వీడియోలు తీశారు. ఈ వీడియోలు ‘సాక్షి’కి చేరడంతో వెంటనే కలెక్టర్ యాస్మిన్ బాషాకు చేరవేసింది. వీడియోలో శ్రీనివాస్ చర్యలు చూసి మండిపడ్డ కలెక్టర్ అతన్ని ఈనెల 16వ తేదీన సస్పెండ్ చేసిన విషయం విదితమే.
నేడు స్కూల్‌కు విచారణ కమిటీ..!
ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు బుధవారం విచారణ కమిటీ స్కూలుకు రానుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సస్పెండ్ అయిన శ్రీనివాస్ తాను ఉత్తముడని చెప్పుకునేందుకు ముందే ప్లాన్ వేశారు. మహిళా సిబ్బంది వద్దకు వెళ్లి.. శ్రీనివాస్ మంచోడు అంటూ స్వచ్ఛందంగా రాసి ఇచ్చినట్లుగా ముందే రాసిన లేఖలు వారికి ఇచ్చి వాటిపై సంతకాలు చేయించేందుకు యత్నించారు. ఈ ఘనకార్యానికి ఓ మహిళా ఉద్యోగి నేతృత్వం వహిస్తున్నట్లు సిబ్బంది వాపోతున్నారు. పర్మినెంట్ ఉద్యోగులంతా ఆ లేఖలపై సంతకాలు చేయకుండా సున్నితంగా తిరస్కరించారు. అయినా.. పట్టువదలకుండా తాత్కాలిక సిబ్బందితో అవే లేఖలపై సంతకాలు చేయించుకున్నారని సమాచారం. ఈ లేఖలను బుధవారం స్కూల్‌కు విచారణకు వచ్చే కమిటీకి అందజేసేలా ప్లాన్ వేశారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. అదే సమయంలో విచారణ కమిటీతో నిందితుడు శ్రీనివాస్ కూడా రానున్నట్లు తెలిసి సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అతను ఎదురుగా ఉంటే విచారణ పారదర్శకంగా ఎలా జరుగుతుందన్న సందేహాలు లేవనెత్తుతున్నారు. మరో ఆసక్తికరమైన అంశమేంటంటే.. శ్రీనివాస్ ఉత్తముడు అంటూ లేఖలపై సంతకాలు పెట్టాల్సిందిగా ఓ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, మరో నలుగురైదుగురు చోటా లీడర్లు స్కూలు సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తుండటాన్ని వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
సిబ్బంది నుంచి లేఖల కోసం బలవంతం
వీడియోలు విడుదలైనా.. కాపాడేందుకు నేతల ప్రయత్నం