
గంజాయిని దహనం చేస్తున్న పోలీసులు
కరీంనగర్ క్రైం: కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని మంగళవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్, జిల్లా మాదకపదార్థాల నియంత్రణ కమిటీ చైర్మన్ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు కమిషనరేట్ కేంద్రంలో దహనం చేశారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న 15.5 కిలోల గంజాయిని కాల్చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) జి.చంద్రమోహన్, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ రాజేశ్, సంబంధిత పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
లాడ్జిలో వ్యాపారి ఆత్మహత్య
కరీంనగర్ క్రైం: కరీంనగర్ ముకరంపురకు చెందిన సయ్యద్ ఫైజాజ్ అహ్మద్ (35) బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. ఫైజాజ్ అహ్మద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ముకరంపురలో నివసిస్తున్నాడు. ఏడాది కిందట అతని భార్య అనారోగ్యంతో చనిపోయింది. అప్పటి నుంచి మనోవేదనకు గురవుతుండేవాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉండగా వారు అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. ఈ నెల 23న ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళుతున్నట్లు అతని సోదరుడికి చెప్పాడు. అప్పటి నుంచి కరీంనగర్‌లోని లాడ్జిలోనే ఉంటున్నాడు. ఈ రోజు సాయంత్రం లాడ్జి సిబ్బంది గదిలో చూసే సరికి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారని తెలిపారు. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మనస్తాపంతో
వార్డు సభ్యురాలు..
సుల్తానాబాద్‌రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామ వార్డు సభ్యురాలు బొంకూరి శైలజ(30) ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ఉపేందర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన కూకట్ల కుమార్, అతని కుటుంబసభ్యులు విజయ్‌కుమార్, సంతోష్, రాకేశ్, స్వరూపలు శైలజను మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం సాయంత్రం ఉరేసుకుంది. మృతురాలి తండ్రి బండ సమ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలికి భర్త, కుమారుడు, కూతురు ఉన్నారు.
ప్రమాదవశాత్తు
బావిలో పడి మహిళ మృతి
పాలకుర్తి: మండలంలోని బసంత్‌నగర్ రాజీవ్‌నగర్(ఒడ్డెర కాలనీ)కు చెందిన జట్‌పట్ అనిత(32) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందింది. బసంత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనిత మంగళవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లి, ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడింది. తెల్లవారినా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, స్థానికులు సమీప ప్రాంతంలో వెతకగా బావిలో కనిపించింది. ఒడ్డుకు చేర్చి, పరిశీలించగా అప్పటికే మృతిచెందినది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.