
సింగరేణి సీఎండీ శ్రీధర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న జనక్‌ప్రసాద్
● ఐఎన్‌టీయూసీ సెక్రటరీ
జనరల్ జనక్‌ప్రసాద్
గోదావరిఖని(రామగుండం): సింగరేణిలో అనారోగ్యంతో బాధపడుతూ మెడికల్ బోర్డుకు వెళ్లే కార్మికులకు ప్రస్తుతం ఉన్న రెండేళ్లను నాలుగేళ్ల సర్వీస్ వరకు అనుమతించాలని సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్.శ్రీధర్‌ను ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్ కోరారు. మంగళవారం సింగరేణి భవన్‌లో ఆయనను కలిసి, వినతి పత్రం అందజేశారు. నాలుగేళ్ల విధానం అమలైతే కార్మికులు మరోసారి మెడికల్ బోర్డుకు వెళ్లే అవకాశం లభిస్తుందన్నారు. బోర్డుకు వెళ్లే ప్రతి కార్మికున్ని మెడికల్ ఇన్‌వాలిడేషన్ చేయాలని కోరారు. ఫలితంగా దళారుల వ్యవస్థ రద్దవుతుందని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా రామగుండం ప్రాంతంలో కలుషితమైన నీటి వల్ల కార్మిక కుటుంబాలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నాయని తెలిపారు. శాశ్వత ప్రతిపాదికన సురక్షితమైన మంచినీరు అందించాలని విన్నవించారు. సింగరేణిలోని డిపెండెంట్ ఉద్యోగుల వయో పరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల మార్పు వెంటనే అమలు చేయాలన్నారు. గోదావరిఖనిలో బీగెస్ట్‌హౌస్‌ను ఐటీపార్కుకు కేటాయించిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల సౌకర్యార్థం మరో గెస్ట్‌హౌస్ నిర్మించాలని పేర్కొన్నారు. సింగరేణి అనుబంధ సంస్థలు నెలకొల్పి, సంస్థ ప్రభావిత ప్రాంతాల వారి పిల్లలకు, ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. స్పందించిన సీఎండీ ఈ నెల 31న సింగరేణి బోర్డు మీటింగ్‌లో అనుమతి తీసుకొని, సమస్యలు పరిష్కరిస్తామన్నారని చెప్పారు.