
బీకేఎంయూ రాష్ట్ర విస్తృత కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి
కరీంనగర్: బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక రైతులు, కూలీల హక్కులను హరిస్తూ.. చట్టాలను మారుస్తూ ఆర్థిక దోపిడీకి గురి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర విస్తృత కౌన్సిల్ ముగింపు సమావేశానికి సోమవారం చాడ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతూ ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ అనుబంధ కూలీల హక్కులకు రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం ఈజీఎస్ పథకానికి 30,500 వందల కోట్లు కుదించారని.. ఇది పేదల ప్రభుత్వమా లేక కార్పొరేట్ల ప్రభుత్వమా అర్థం కావడం లేదని ఆరోపించారు. అట్టడుగు వర్గాల హక్కుల సాధనకు వారి రక్షణ కోసం దేశంలో సమాచార హక్కు చట్టం, అటవీ భూముల హక్కుల చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రెవెన్యూ చట్టం తీసుకురావడంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లో నడిచే బీజేపీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైందని, విదేశాల్లో దాచుకున్న డబ్బులను వెనక్కి తీసుకొస్తానని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, దేశ ప్రజలందరికీ అచ్చేదిన్ వస్తుందని మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించేందుకు బీజేపీ పూనుకుంటోందన్నారు. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు కార్మికులు, కర్షకులు ఏకం కావాలని చాడ పిలుపునిచ్చారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని.. ఉద్యోగాలు కరువయ్యాయని అన్నారు. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో జరిగిన లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇండ్లు లేని నిరుపేదలందరికీ స్థలాలు ఇవ్వాలని, ప్రభుత్వ భూ ముల్లో గుడిసెలు వేసుకున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని, రేషన్ కార్డు లేని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీకేఎంయూ జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా, జాతీయ కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు టి.వెంకట్రాములు, మోతె లింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కలకొండ కాంతయ్య, నక్క బాల మల్లేశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం ఆఫీస్ బేరర్స్ కొయ్యడ సృజన్ కుమార్ పాల్గొన్నారు.
రైతు కూలీల హక్కులను హరించడం అప్రజాస్వామికం
టీఎస్‌పీఎస్‌సీ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి