
సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసిన కళాకారులు
చిగురుమామిడి: మండల కేంద్రంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీనగర్‌లో మండలంలోని ఆయా గ్రామాల రంగస్థల కళాకారులు హాజరై, కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టారు. పాటలు, భజనలతో సందడి చేశారు. రంగస్థల సాంస్కృతిక కళాకారుల సంఘం మండల అధ్యక్షుడు శ్రీరామోజు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. 50 ఏళ్లు నిండిన కళాకారులకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలని కోరారు. కళాకారులకు మేకప్ కిట్, సౌండ్ సిస్టం, వాయిద్య పరికరాలు అందించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చందబోయిన పర్శరాములు, మండల ప్రధాన కార్యదర్శి రాధారపు సంపత్, ఉపాధ్యక్షుడు ఎం.సంపత్, కోశాధికారి బి.లక్ష్మీనారాయణ, కళాకారులు పాల్గొన్నారు.
న్యాయవాద గుమస్తాల సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక
హుజూరాబాద్‌రూరల్: న్యాయవాద గుమస్తాల సంఘం ఎన్నికల్లో గోపగోని సాయిరాం విజయం సాధించినట్లు ఎన్నిక ల అధికారి అంబాల ప్రవీణ్ సోమవారం తెలిపారు. ఉపాధ్యాక్షుడిగా ఎడ్ల రాజు, కార్యదర్శిగా బల్ల వీరు, కోశాధికారిగా వల్లెపు నరేష్ ఎన్నికై నట్లు పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికై న వారిని బార్ అసోషియేషన్ అధ్యక్షుడు బండి కళాధర్, పలువురు న్యాయవాదులు అభినందించారు.
దళిత బంధు యూనిట్ల పరిశీలన
జమ్మికుంట(హుజూరాబాద్): మున్సిపల్ పరిధిలోని దళిత బంధు యూనిట్లను కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు సోమవారం పరిశీలించారు. మోత్కులగూడెంలోని డెయిరీ ఫామ్, పట్టణంలోని ఏటుజెడ్ మెడికల్, మొబైల్ షాపుల్లో వ్యాపార లావాదేవీలు, ఆదాయం, నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఆదాయం పెంచుకొని, ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో దళిత బంధు పథకం ప్రత్యేక ఆధికారి సురేష్, ఈడీ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

సాయిరాం