
వెంకటేశ్వర్‌రావు (ఫైల్)
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ బార్ అసోసియేషన్ న్యాయవాది అన్నమరాజు వెంకటేశ్వరరావు(54) మృతికి జిల్లా కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు సంతాపం తెలిపారు. ఆయన కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కోర్టు హాలులో సంతాప సమావేశం ఏర్పాటు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, న్యాయవాదులు టి.వేణుగోపాల్, కనుకుల సంజీవరెడ్డి, బొడ్ల శ్రీనివాస్‌లు వెంకటేశ్వర్‌రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జిల్లా జడ్జి బి.ప్రతిమ మాట్లాడుతూ.. తొందరపాటు, ఆవేశంతో మనకు నష్టం జరగడంతోపాటు ఇతరులకు కూడా ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు. అందరూ తొందరపాటును విడనాడాలని సూచించారు. వెంకటేశ్వర్‌రావు మృతికి సంతాపం తెలిపి, ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపంగా న్యాయవాదులు సోమవారం విధులకు గైరాజరయ్యారు.