
మాట్లాడుతున్న జెడ్పీ సీఈవో ప్రియాంక
కరీంనగర్ అర్బన్: ప్రతీ వారం 100 నుంచి 120 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని జెడ్పీ సీఈవో ప్రియాంక ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఆయిల్‌పామ్ సాగుపై వ్యవసాయ, ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 603 ఎకరాల్లో మొక్కలు నాటినట్లు తెలిపారు. 93 మంది రైతులకు 296 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు నిధులు విడుదలయ్యాయని పేర్కొన్నారు. అంతర పంటలు, నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఒక ఎకరానికి రూ.4,200 చొప్పున ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి జిల్లాకు రాయితీ డబ్బులు వచ్చాయని అన్నారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారని, గతేడాది సాగు చేసిన తోటల్లో మొక్కలకు పూత కూడా ప్రారంభమైందని అన్నారు. వచ్చే వానాకాలంలో 4,500 ఎకరాల్లో మొక్కలు నాటడమే లక్ష్యంగా అన్నదాతల ఎంపిక జరగాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, మైక్రో ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈవో ప్రియాంక