పత్తి విత్తనం.. రైతుకు భారం | - | Sakshi
Sakshi News home page

పత్తి విత్తనం.. రైతుకు భారం

Mar 28 2023 12:12 AM | Updated on Mar 28 2023 12:12 AM

విత్తన ప్యాకెట్లు - Sakshi

విత్తన ప్యాకెట్లు

కరీంనగర్‌ అర్బన్‌: అసలే వాతావరణ ప్రతికూల పరిస్థితులతో కునారిల్లుతున్న అన్నదాతకు ప్రభుత్వ సాంత్వన కరువవుతోంది. ఇప్పటికే విత్తన రాయితీలను ఎత్తేసిన సర్కారు తాజాగా పత్తి విత్తన ప్యాకెట్‌ ధర పెంచేసింది. విత్తన ధరలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకెట్‌ ధర రూ.853 నిర్ణయించగా గతేడాదితో పోలిస్తే ప్యాకెట్‌కు రూ.43 పెరిగింది. ఈ లెక్కన కరీంనగర్‌ జిల్లా రైతులపై రూ.1.29 కోట్ల భారం పడనుంది. గతంతో పోలిస్తే ఎరువులు, మందులు, కూలీల ధరలు పెరగడంతో పెట్టుబడి మరింత పెరగనుందని కర్షకులు కలవరపడుతున్నారు.

బీటీ–2కే ప్రాధాన్యత..

పత్తి పండించే రైతులు విత్తనాలను ప్రైవేటుగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పలు కంపెనీ లు వివిధ రకాల విత్తనాలను మార్కెట్లో ప్రవేశపెట్టడంతో వాటి ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. ఏటా విత్తన తయారీ తదితర ఖర్చులను లెక్కించి, సర్కారు ధరను నిర్ణయిస్తుంది. అలా ప్రకటించిన ధరకే కంపెనీలు విత్తనాలను విక్రయించాలి. మార్కెట్‌లో బీటీ–1, బీటీ–2 రకాలు అందుబాటులో ఉన్నా ఎక్కువ మొత్తంలో బీటీ–2 విత్తనాన్నేసాగు చేస్తారు. జిల్లాలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండగా ఏటా 3 లక్షల పత్తి విత్తన ప్యాకెట్ల(ఒక్కొక్కటి 450 గ్రాములు) విక్రయాలు జరుగుతాయి.

నకిలీ బెడద తప్పేనా?

కరీంనగర్‌ జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం 3.50 లక్షల ఎకరాలు కాగా రైతులు 1.80 లక్షల మంది ఉన్నారు. పత్తి సాగు చేసే రైతులు ఎకరాకు రెండు నుంచి మూడు సంచుల విత్తనాన్ని ఉపయోగి స్తారు. ఈ లెక్కన జిల్లా సాగు విస్తీర్ణం లక్ష ఎకరా లు కాగా 3 లక్షలకు పైగా విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. వందల రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం బీటీ–2 విత్తనాల ప్యాకెట్‌ ధర రూ.810 ఉంది. వచ్చే సీజన్‌లో ఒక సంచి రూ.853తో విక్రయించుకోవచ్చని కేంద్రం ప్రకటించింది. ఎక్కువ మొత్తంలో అవసరం ఉండటంతో ఏటా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తు న్నా వాటికి అడ్డుకట్ట పడటం లేదు. మరి ఈసారి నకిలీ బెడద తప్పేనా అన్న చర్చ జరుగుతోంది.

విత్తనాలపై స్పష్టత అవసరం

ఏటా నకిలీ విత్తనాలు నీడలా వెంటాడుతుంటే వ్యవసాయ శాఖ తదనుగుణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. పత్తి విత్తనాలను ప్రభుత్వం రాయితీపై ఇవ్వడం లేదు. ప్రైవేటు కంపెనీలే ఆధారం. ఈ క్రమంలో అసలు ఏయే కంపెనీలకు అనుమతి ఉంది, ఎంత ధర తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలి. నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్ల లైసెన్స్‌ రద్దు చేయాలి. ఇక వచ్చే సీజన్లో ప్రతి విత్తన సంచిపై క్యూఆర్‌ కోడ్‌ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఏ కంపెనీ, ఎప్పుడు తయారు చేసింది, లాట్‌ నంబర్‌, విత్తన రకం తదితర వివరాలు తెలుసుకోవచ్చు. గతంలో పలు కంపెనీలు విక్రయించిన విత్తనాలు నాసిరకమని తేలాయి. అలాంటి విత్తనాలతో రైతులకు నష్టం జరిగితే పరిహారం ఇప్పించేలా ఒప్పందం చేసుకోవాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.

గతేడాది ప్యాకెట్‌ ధర రూ.810.. ప్రస్తుతం రూ.853

జిల్లా కర్షకులపై

రూ.1.29 కోట్ల భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement