క్వార్టర్లు బారెడు.. | - | Sakshi
Sakshi News home page

క్వార్టర్లు బారెడు..

Mar 27 2023 12:54 AM | Updated on Mar 27 2023 12:54 AM

కౌన్సెలింగ్‌కు హాజరైన ఉద్యోగులు  - Sakshi

కౌన్సెలింగ్‌కు హాజరైన ఉద్యోగులు

కేటాయింపులు మూరెడు..

క్వార్టర్ల ఖాళీ లిస్టు బారెడు.. కేటాయింపులు మూరెడుతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి అన్ని ఏరియాల్లో నెలకొంది. సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఖాళీ క్వార్టర్ల సంఖ్య నెలనెలా పెరుగుతుండడంతో మిగులు క్వార్టర్లను కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలనే డిమాండ్‌ ఉంది. పర్మినెంట్‌ కార్మికులు క్వార్టర్లు తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇదేక్రమంలో కాంట్రాక్టు కార్మికులకు క్వార్టర్లను అలాట్‌ చేసేందుకు ఇష్టపడడం లేదు. సకాలంలో క్వార్టర్ల కేటాయింపునకు కౌన్సెలింగ్‌ నిర్వహించినప్పటికీ తీసుకునేవారి సంఖ్య రానురాను తగ్గిపోతోంది. దీంతో ఖాళీ క్వార్టర్ల సంఖ్య పెరిగిపోతున్నాయి. క్వార్టర్లు చాలావరకు మరమ్మతుల్లో ఉండడం, నిర్వహణ సరిగ్గా లేక వాటిని తీసుకునేందుకు కార్మికులు వెనుకాడుతున్నారు. కార్మికులు ఉద్యోగ విరమణ పొందడంతో క్వార్టర్లను ఖాళీచేసి వెళ్తుండగా వారిలో మంచి క్వార్టర్లను మాత్రమే ప్రస్తుతం అర్హతగల ఉద్యోగులు ఎంచుకుంటున్నారు. మరమ్మతుల్లో ఉన్న, వాస్తు సరిగ్గా లేని క్వార్టర్ల జోలికి కార్మికులు వెళ్లడం లేదు. దీంతో సంస్థవ్యాప్తంగా ప్రతినెలా మూలకు పడే క్వార్టర్ల సంఖ్య పెరుగుతోంది. ఖాళీ క్వార్టర్లలో పదిశాతం కూడా కేటాయింపులు లేకపోవడంతో మిగిలిపోయే క్వార్టర్ల సంఖ్య సంస్థవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి.

మంచి క్వార్టర్లకు డిమాండ్‌

సంస్థలోని అన్నిఏరియాల్లో మంచి క్వార్టర్లకు మాత్రమే డిమాండ్‌ పెరిగింది. షిర్కే, టీవన్‌, డీటైప్‌ క్వార్టర్లు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఖాళీ స్థలంఉన్న టీటూ, ఎస్సీటూ, ఎండీ, ఎంసీ టైప్‌ క్వార్టర్ల వైపు దృష్టిసారిస్తున్నారు. దీంతో అన్నిఏరియాల్లో పురాతన, ఇరుకుగా ఉన్న క్వార్టర్లు మిగిలిపోతున్నాయి.

కాంట్రాక్టు కార్మికుల ఎదురు చూపు..

సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు 25వేలకు పైగా ఉన్నారు. వీరికి క్వార్టర్లను కేటాయించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. నివాసం ఉండేందుకు అద్దెఇళ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నామని కనీసం సింగరేణి క్వార్టర్లను అద్దె ప్రతిపాదికన కేటాయించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఖాళీ క్వార్టర్లను అన్యాక్రాంతం చేసే బదులు కాంట్రాక్టు కార్మికులకు కేటాయిస్తే క్వార్టర్లు వినియోగంలోకి వస్తాయని అంటున్నారు. ఈ విషయంలో సింగరేణి కార్మిక సంఘాలు దృష్టిసారించి యాజమాన్యంతో చర్చించి ఒప్పించాలని కోరుతున్నారు.

ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి

సింగరేణి స్థాయిలో ఖాళీ క్వార్టర్లను గుర్తించేందుకు కార్పొరేట్‌ స్థాయిలో ప్రత్యేక కమిటీ వేయాలనే డిమాండ్‌ పెరుగుతోంది. గుర్తించిన ఖాళీ క్వార్టర్లను ఏరియాల వారీగా కేటాయించాలని కోరుతున్నారు. ఈ విషయంలో కార్పొరేట్‌ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.

గోదావరిఖని: ‘రెండు రోజుల క్రితం ఆర్జీ–2 ఏరియాలో సింగరేణి యాజమాన్యం కౌన్సెలింగ్‌ నిర్వహించి క్వార్టర్ల కేటాయింపు చేపట్టింది. 615 క్వార్టర్లు ఖాళీగా ఉండడంతో వాటిని సింగరేణి ఉద్యోగులకు కేటాయించాలని ఉత్తర్వులు జారీచేసింది. వీటిలో 147మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 60 మంది మాత్రమే హాజరయ్యారు. అర్హత ప్రకారం 50 మందికి మాత్రమే క్వార్టర్లు కేటాయించారు. ఈ లెక్కన ఖాళీల్లో 10శాతం కూడా భర్తీకాలేదు. అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.’

ఎన్ని కౌన్సెలింగ్‌లు నిర్వహించినా భర్తీకాని క్వార్టర్లు

సగానికి పైగా మిగులుతున్న వైనం

మరమ్మతులు నిర్వహించాకే కేటాయించాలి

కాంట్రాక్టు కార్మికులకు సైతం అలాట్‌ చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement