● వచ్చే నెలలో మార్కెట్‌కు రానున్న పంట ● కేంద్రాలపై కార్యాచరణ, అవసరాలపై నివేదిక ● ఐకేపీ, పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, మార్కెట్లలో కొనుగోళ్లు

మొత్తం కొనుగోలు కేంద్రాలు 351
ఐకేపీ 62
పీఏసీఎస్‌ 231
డీసీఎంఎస్‌ 50
మార్కెట్‌ యార్డులు 8 - Sakshi

కరీంనగర్‌ అర్బన్‌: ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గత అనుభవాల క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపడుతూ కొనుగోళ్లు సాగేలా కార్యాచరణతో సాగుతోంది. సాగు విస్తీర్ణం ఆధారంగా కొనుగోలు కేంద్రాలు, అవసరాలపై ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశించడంతో తదనుగుణ ప్రక్రియ చేపడుతోంది. జిల్లాలో 95,382 హెక్టార్లలో వరి సాగవగా 5.12లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అధికారుల అంచనా. ఇందులో విత్తనం, స్థానిక అవసరాలకు 1,04,145 మె.ట పోనూ 4లక్షల మె.ట కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. జిల్లావ్యాప్తంగా 351 కేంద్రాలకు ప్రతిపాదనలు రూపొందించగా దాదాపు అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు జరగనున్నాయి.

ఏప్రిల్‌ నెలలో..

జిల్లాలో కరీంనగర్‌ అర్బన్‌తో పాటు 15 మండలాల్లో వరి సాగు చేశారు. హుజూరాబాద్‌, వీణవంక, చిగురుమామిడి, సైదాపూర్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, శంకరపట్నం, మానకొండూరు, తిమ్మాపూర్‌ మండలాల్లో సాగైన వరిలో 20శాతం విత్తన వరి సాగు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. మిగిలిన ధాన్యం కేంద్రాలకు రానుండగా ఇతర మండలాల్లో పూర్తిగా దొడ్డురకం సాగు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోతల వెంటే కొనుగోళ్లు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్‌ మొదటి వారంలో పంట చేతికి రానుండగా ఇక అప్పటి నుంచే కొనుగోళ్లు మొదలవనున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రెండు రోజుల్లో రానుండగా కొనుగోళ్లకు అధికారులు పూర్తి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

గన్నీ సంచులు, రవాణే సమస్య

జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా గతంలో రైతుల ఎదుర్కొన్న సమస్యలను దూరం చేయాల్సిన అవసరం ఉంది. గన్నీ సంచుల కొరత, రవాణాలో ఆలస్యం చాలా కేంద్రాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. మిల్లర్ల దోపిడీ నిత్యకృత్యంగా సాగింది. ఈ నేపథ్యంలో సదరు సమస్యల్లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు. ఇదిలాఉంటే పదెకరాలున్న రైతుకు పట్టాదారు పాసుపుస్తకం, రికార్డుల్లో తప్పుగా ఆరెకరాలే అచ్చయించదనుకో.. మిగతా నాలుగు ఎకరాల పంట అమ్ముకోవాలంటే ఇబ్బందులే. గతంలో ఇతర రైతుల పేరుతో కౌలుదారుడిగా రాసుకుని ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నా.. ఆ రైతు కూడా తనకున్న భూమిలో అదే పంట పండిస్తేనే అనుకూలం.

మొత్తం రైస్‌ మిల్లులు 169 రా రైస్‌ మిల్లులు 82 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు 87

వెంటాడుతున్న వర్షం భయం

ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అకాల వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలకు నష్టం వాటిల్లుతోంది. నెలల తరబడి పంటను కాపాడుకునేందుకు శ్రమించిన రైతులకు వడగళ్ల వాన గంటలోనే తుడిచేస్తోంది. గతేడాది వరి, మామిడి, మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోయారు. ధాన్యం రంగు మారడం తేమ సాకుతో కల్లాల వద్దే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్‌ నెలలు ఎలా గడుస్తాయోనన్న భయం అన్నదాతలను వెంటాడుతోంది. కాగా ఏప్రిల్‌ మొదటి వారంలో కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల సంస్థ డీఎం శ్రీకాంత్‌ పేర్కొన్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top