
కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద అనభేరి విగ్రహం (ఫైల్)
కరీంనగర్: నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలన్న లక్ష్యంతో సాయుధ పోరాటాన్ని ఎంచుకున్నారు.. నిజాం గుండెల్లో రణభేరి మోగించిన అనభేరి ప్రభాకర్‌రావు 1910 ఆగస్టు 15న తిమ్మాపూర్ మండలం పొలంపెల్లిలో జన్మించారు. ప్రాథమిక విద్య మచిలీపట్నం, ఉన్నత విద్య హైదరాబాద్‌లో అభ్యసించారు. సీపీఐ జిల్లా తొలి కార్యదర్శిగా ఎన్నికై న ఆయన భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంకెళ్ల విముక్తి కోసం, భూస్వామ్య వ్యవస్థ నిర్మూలన కోసం, జాగీర్‌దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలను జాగృతం చేశారు. తెలంగాణ విముక్తి కోసం జీవితాన్ని త్యాగం చేసిన తొలి తెలంగాణ సాయుధ దళ నాయకునిగా చరిత్రకెక్కారు. ప్రభాకర్‌రావుపై నిజాం ప్రభుత్వం ’నజర్ బంద్‘ హుకుం జారీ చేసి, తీవ్ర నిర్బంధం కొనసాగించింది. అయినా అజ్ఞాతంలో ఉంటూనే నిజాం నవాబు, భూస్వాముల దురాగతాలను వ్యతిరేకిస్తూ పోరాటం సాగించారు. చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం చేనేత పారిశ్రామిక సంఘాన్ని స్థాపించి, అనాడే 30 వేల మందికి ఉపాధి కల్పించారు.
మహ్మదాపూర్ గుట్టల్లో అమరత్వం..
ప్రభాకర్‌రావును పట్టుకునేందుకు నిజాం ప్రభుత్వం ప్రత్యేక మిలటరీ ఫోర్స్ ఏర్పాటు చేసింది. 1948 మార్చి 14న ఆయన సాయుధ దళాన్ని కరీంనగర్ (ప్రస్తుతం సిద్దిపేట) జిల్లా పరిధిలో ని హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ పోలీస్ పటేల్ భోజనానికి పిలిచి, ఆ సమాచారాన్ని నిజాం ప్రభుత్వానికి తెలియజేశాడు. దీంతో మహ్మదాపూర్ గుట్టలను మిలటరీ, రజాకార్లు చుట్టుముట్టారు. అనభేరి గెరిల్లా దళంపై పోలీసులు కాల్పులు జరిపారు. వారి తూటాలకు ఎదురొడ్డి పోరాడి ‘అనభేరి’తోపాటు సింగిరెడ్డి భూపతిరెడ్డి, ముస్కు చొక్కారెడ్డి, ఏలేటి మల్లారెడ్డి, అయిరెడ్డి భూంరెడ్డి, తూమేజు నారాయణ, బి.దామోదర్‌రెడ్డి, ఇల్లందుల పాపయ్య, పోరెడ్డి రాంరెడ్డి, నల్గొండ రాజరాం, చిక్కుడు సాయిల్, రోండ్ల మాధవరెడ్డి బలయ్యారు.
వర్ధంతిని జయప్రదం చేయాలి
స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం గుండెల్లో రణభేరి మోగించిన అనభేరి ప్రభాకర్‌రావు 75వ వర్ధంతిని మంగళవారం నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తెలి పారు. కరీంనగర్‌లోని కూరగాయల మార్కెట్ వద్ద గల ప్రభాకర్‌రావు విగ్రహం వద్ద, మహ్మదాపూర్‌లో నిర్వహించే వేడుకలకు సీపీఐ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరై, జయప్రదం చేయాలని కోరారు.
సాయుధ పోరులో ఒరిగిన తొలిదళ నాయకుడు
రజాకార్లను మట్టుబెట్టిన పొలంపెల్లి ముద్దుబిడ్డ
నేడు ప్రభాకర్‌రావు 75వ వర్ధంతి

ప్రభాకర్‌రావు (ఫైల్)