
ఇంకుడు గుంతలో పడి బాలుడి మృతి
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు ఇంకుడు గుంతలో పడి మృతి చెందినట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. మోపాల్ మండలం కులాస్‌పూర్ గ్రామానికి చెందిన కొత్త కుమ్మరి రాణి కొన్ని రోజులుగా కొండాపూర్‌లోని తన తల్లిగారింటి వద్ద ఉంటోంది. ఈక్రమంలో రాణి కొడుకు రిత్విక్(3) ఇంటి ముందర చిన్న సైకిల్‌పై ఆడుకుంటుండగా, ఇంటి పక్కన గల కోటగిరి నారాయణగౌడ్ ఇంటి వద్ద ఉన్న ఇంకుడు గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. చాలా సేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సిరికొండకు అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. బాలుడి తల్లి రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.