
ప్రాథమికంలో మెరుగు‘బడి’
నిజామాబాద్‌అర్బన్: విద్యావ్యవస్థలో మార్పు మొ దలైంది. బోధనాభ్యసన ప్రక్రియలో సత్ఫలితా లు వస్తున్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న తొలిమెట్టు(ఎఫ్‌ఎల్‌ఎన్), లిప్(లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమాలతో విద్యార్థులకు గుణాత్మక విద్య అందుతూ అభ్యసన ఫలితాలు మెరుగవుతున్నాయి. ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ఫరక్ రాష్ట్రీయ, సర్వేక్షణ(న్యాస్) సర్వే నివేదికలో ఉమ్మడి జిల్లా మెరుగైన స్థానంలో ఉంది.
సర్వే ఇలా..
ఉమ్మడి జిల్లాలో దాదాపు 180 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2024 డిసెంబర్ 4న న్యాస్, ఎన్‌సీఈఆర్టీ సంయుక్తంగా రాష్ట్రీయ సర్వేక్షణ్–ఫరఖ్ సర్వేను నిర్వహించాయి. ఫలితాలను ఉదిత్, ఉదయ్, ఉన్నత్, ఉద్భవ్ అనే నాలుగు కేటగిరీలుగా వర్గీకరించి కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. 25 శాతం కంటే తక్కువ అభ్యసన స్థాయిలను కలిగి ఉంటే ఉద్భవ్‌గా, 25–50 మధ్య ఉంటే ఉన్నతిగా, 50–75 మధ్య ఫలితాలను ఉదయ్, ఆపైన ఫలితాలు వస్తే ఉదిత్‌గా ప్రకటించారు. కేంద్రం విడుదల చేసిన ఈ ఫలితాలలో ఉమ్మడి జిల్లా ఆశాజనక స్థానం సాధించింది.
● 3వ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా 9వ, నిజామాబాద్ 18వ స్థానాన్ని సాధించాయి. గత న్యాస్ సర్వే కంటే పది స్థానాలు మెరుగుపడినాయి. అలాగే ప్రైవేట్ బడుల కంటే ప్రభుత్వ బడులలో అభ్యసన సామర్థ్యాలు పెరిగినాయి. 6వ తరగతిలో భాష, గణితంలో ఉన్నతి, ఉద్భవ్ స్థాయిలో ఉండగా, సామర్థ్యాల పరంగా వెనుకబడ్డాయి. 9వ తరగతిలో అభ్యసన ఫలితాలు మెరుగయ్యాయి.
తరగతులవారీగా అభ్యసన స్థాయి శాతం
ఉన్నతంలో వెనుకడుగు
జాతీయ సాధన సర్వేలో
ఆశాజనక ఫలితాలు
గత సర్వే ఫలితాల కంటే మెరుగు
ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ కార్యక్రమాలతో సత్ఫలితాలు
ప్రభుత్వ బడులు బలోపేతం
2022 ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టిన తొలిమెట్టు, లిప్ కార్యక్రమాలతో ప్రభుత్వ బడులలో అభ్యసన ఫలితాలు మెరుగయ్యాయి. అలాగే డీఎస్సీ–2024, డీఎస్సీ–2008 ద్వారా జిల్లాలో నూతనంగా నియామకమైన 650 ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమై విద్యార్థులకు గుణాత్మక విద్య అందిస్తున్నాయి. కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించడంతోపాటు తరగతి గది అభ్యసన ఫలితాలను సాధించేందుకు గత విద్యాసంవత్సరం నుంచి పంపిణీ చేసిన వర్క్‌బుక్‌లు దోహదపడ్డాయి.
ఉపాధ్యాయుల కృషితోనే..
ఇటీవల వెలువడిన జాతీయ సాధన సర్వేలో మంచి ఫలితాలు రావడం శుభ పరిణామం. ఉపాధ్యాయుల కృషితోనే ఇది సాధ్యమైంది. ప్రాథమిక స్థాయిలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తాం.
– అంకం నరేశ్,
పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు