
ఆగని ఇసుక అక్రమ రవాణా
మద్నూర్(జుక్కల్): అధికారులు, పోలీసులు అనుమతులు లేని ఇసుక వాహనాలను పట్టుకుంటున్న అక్రమార్కులు మాత్రం రాత్రి వేళల్లో తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. మద్నూర్ ఉమ్మడి మండలంలోని కుర్లా, సిర్‌పూర్ ప్రాంతాల్లోని మంజీర వాగులోంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాల్లో టిప్పర్, ట్రాక్టర్‌లలో ఓవర్ లోడ్‌తో ఇసుకను నింపి తరలిస్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు అక్రమ ఇసుక టిప్పర్, ట్రాక్టర్‌లను పట్టుకోని కేసులు నమోదు చేస్తున్న అక్రమార్కులు మాత్రం వెనక్కితగ్గడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మంజీర నది నుంచి ఇసుకను లోడ్ చేసి మద్నూర్ మండలంలోని పెద్ద తడ్గూర్, పెద్ద ఎక్లార మీదుగా కర్ణాటక, మహారాష్ట్రలకు తరలిస్తున్నారు. మంజీరాలో ఇసుకను తోడేస్తుండడంతో భూగర్భ జలాలు అంతరించే పోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇసుక తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
టిప్పర్‌లతో పక్క రాష్ట్రాలకు తరలింపు
మద్నూర్ ఉమ్మడి మండలంలోని
మంజీర వాగులో ఇసుకను
తోడేస్తున్న అక్రమార్కులు
కఠిన చర్యలు తప్పవు
ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సంబంధిత వాహనాలను పట్టుకోని మైన్స్ అధికారులకు అప్పగిస్తున్నాం. అలాగే అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలపై కేసులు సైతం నమోదు చేస్తున్నాం. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశాం.
– విజయ్ కొండ, ఎస్సై, మద్నూర్

ఆగని ఇసుక అక్రమ రవాణా