
మాట్లాడుతున్న మేడ్చల్ మల్కాజ్‌గిరి అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి
తెయూ(డిచ్‌పల్లి): దక్కన్ ప్రాంతంపై మరిన్ని చారిత్రక పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని ప్రసిద్ధ సాహితివేత్త, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ లా కాలేజీ సెమినార్ హాల్‌లో రెండు రోజులుగా జరుగుతున్న తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ ముగింపు సమావేశంలో బుధవారం సాయంత్రం ఆయన పాల్గొని ప్రసంగించారు. దక్కన్ చరిత్రను పరిపూర్ణ రీతిలో రచించే క్రమంలో తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ కృషి చేయాలని సూచించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ఇన్‌టాక్ కన్వీనర్ అనురాధరెడ్డి నిజామాబాద్ చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను, సంస్థానాల విశేషాలను వివరించారు. హైదరాబాద్‌కు చెందిన చరిత్ర పరిశోధకులు రమేష్ రామనాథం ‘భారతావనిలో బొమ్మల సంస్కృతి’ అనే అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒంటి గుండు ప్రాంతంలో ఉన్న నల్లమూడి అడవులలోని రాతి చిత్రాల గురించి డాక్టర్ బీఎం రెడ్డి, శ్రీనివాస్, గోపి వరప్రసాద్‌రావు పత్ర సమర్పణ చేశారు. కందకుర్తి యాదవరావు ‘స్థానిక చరిత్ర’లపై చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం పూర్వ అధ్యక్షుడు కేఎస్‌ఎస్ శేషన్, ఆచార్య వెంకటరాజం, ఆచార్య అర్జునరావు, ఆచార్య సీహెచ్ ఆరతి, సమన్వయకర్త బాల శ్రీనివాసమూర్తి, సీహెచ్ ఆంజనేయులు, ప్రసన్న రాణి, మహమ్మద్ అబ్దుల్ కవి పాల్గొన్నారు.
కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ చరిత్ర కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అర్జునరావు అధ్యక్షుడిగా, ఎం వీరేందర్ ప్రధాన కార్యదర్శిగా, గౌరవ అధ్యక్షుడిగా వెంకటరాజం ఎన్నికయ్యారు.
మేడ్చల్ మల్కాజ్‌గిరి అడిషనల్
కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి
ముగిసిన తెలంగాణ చరిత్ర
కాంగ్రెస్ సదస్సు