
వీసీలో పాల్గొన్న కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు
కామారెడ్డి టౌన్: ఎస్సెస్సీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. బుధవారం ఆమె విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేనలతో కలిసి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలను అధికారులు విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపారు. వచ్చేనెల 3వ తేదీనుంచి 13 వరకు జరుగుతున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పదో తరగతిలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లుగా కుదించామని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్‌ఎం అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఉదయం, మధ్యాహ్నం వేళలలో నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కలెక్టర్లు రవాణ, పోలీస్, రెవెన్యూ, వైద్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. bse. telangana. gov. in లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచామని, విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 11,899 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారని, వీరికోసం 63 కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. 595 మంది ఇన్విజిలెటర్లు, 63 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా విద్యాధికారి రాజు, జిల్లా పరీక్షల విభాగం అధికారి నీల లింగం తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు రవాణా
సౌకర్యం కల్పించాలి
వీసీలో విద్యాశాఖ మంత్రి
సబితా ఇంద్రారెడ్డి