
పూజలు చేస్తున్న సేవాలాల్ స్వాములు
బాన్సువాడరూరల్: అభివృద్ధికి ఆమడదూరంలో అడవుల్లో ఉండే బంజారాల జీవితాలు మారుతున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలకు తోడు తమ ఆరాధ్య దైవం శ్రీరామరావు మహారాజ్ బోధనలు, ప్రేమ్‌సింగ్ మహారాజ్ ప్రారంభించిన సేవాలాల్ దీక్షలతో బంజారా బిడ్డల జీవనశైలి మారింది. మేముసైతం అంటూ భక్తి మార్గంలో పయనిస్తూ ఆదర్శజీవితం గడుపుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 285 గిరిజన తండాలు ఉండగా, జనాభా సుమారు లక్షా 50వేలు ఉంది. ఈసారి సుమారు 4వేల మందికి పైగా శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష తీసుకున్నారు.
1979లో దీక్షలు ప్రారంభం
బంజారాలను ఏకం చేయడానికి 1979లో మొదటి సారిగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లికి చెందిన ప్రేమ్‌సింగ్ మహారాజ్ సేవాలాల్ మాలాధారణను ప్రారంభించారు. ఆరంభంలో మాలాధారణకు అంతగా ప్రాచుర్యం లభించలేదు. రామ్‌రావ్ మహారాజ్ ప్రతి తండాలో పర్యటిస్తూ తన బోధనలతో గిరిజనుల్లో మార్పునకు కారణమయ్యారు. ప్రస్తుతం ప్రతీ తండాలోనూ జగదాంబమాత– శ్రీసంత్ సేవాలాల్ మందిరాలను నిర్మించుకున్న బంజారాలు వందల సంఖ్యలో మాల ధరిస్తున్నారు. ఒకప్పుడు గుడుంబా తయారీతో గుప్పుమ నే కొన్ని గిరిజన తండాలు నేడు జీవనశైలిని మార్చు కుని భక్తి పారవశ్యంలో తేలియాడుతున్నాయి.
వ్యసనాలకు దూరం
తండాలో ప్రతి ఏటా శ్రీ రామ నవమి పండగకు 41 రోజులు ముందునుంచి సేవాలాల్ దీక్షలు చేపడుతున్నారు. ఇలా దీక్ష తీసుకుని మాలాధరణ చేసినవారు కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ ఉదయం, సాయంకాలం అమ్మవారికి హారతి ఇస్తూ గడపటంతో చెడువ్యసనాల నుంచి దూరంగా ఉండటానికి అవకాశం కల్గుతోంది. గులాబీ రంగు చొక్కా, తెల్లదోవతి ధరించి స్వాములు 41 రోజుల దీక్ష అనంతరం శ్రీ రామ నవమి నాడు మహారాష్ట్రలోని పౌరాఘడ్ సందర్శించిన అనంతరం దీక్ష విరమించి భక్తిమార్గంలో నడుస్తున్నారు.
సేవాలాల్ దీక్షల్లో తరిస్తున్న గిరిజనులు
తండాల్లో జగదాంబ దేవి, సేవాలాల్ మందిరాల నిర్మాణం
రామనవమితో ముగియనున్న దీక్షలు
ప్రశాంతంగా ఉంటుంది
దీక్ష తీసుకుని తండాల్లోని జగదాంబ, సేవాలాల్ మందిరంలోనే 41రోజలు గడుపుతుండడంతో మనసు ప్రశాంతంగా ఉంటోంది. ఉదయం, సాయంత్రం అమ్మవారికి హారతి ఇచ్చే భాగ్యం, భజన చేసే అవకాశం కలుగుతోంది.
– కేతావత్ సురేష్ మహరాజ్, బాన్సువాడ
దీక్షతో సకల శుభాలు
పాత నిజామాబాద్ జిల్లాలో నేను మొదటి సారి దీక్ష తీసుకున్నాను. శ్రీసంత్ సేవాలాల్ దీక్ష చేపట్టిన వారికి సకల శుభాలు చేకూరి, జీవనం ఆనందమయంగా కొనసాగుతుంది. దీంతో దీక్షాధారుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది.
– హరిమహరాజ్, మైలారం తండా, నస్రుల్లాబాద్

