
నాగిరెడ్డిపేట: మండలంలోని చీనూర్ సర్పంచ్ సౌందర్య భర్త మాసగల్ల లక్ష్మీనారాయణ(30) బుధవా రం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం హైద్రాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్న క్రమంలో గుండెపోటుకు గురై మృతిచెందాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ లక్ష్మీనారాయణ మృతదేహంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు.
చికిత్స పొందుతూ ఒకరు..
వేల్పూర్: మండలంలోని లక్కోర గ్రామానికి చెందిన ఈర్ల గంగాధర్(28) జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించినట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. వివరాలు.. గంగాధర్‌కు నిర్మల్ జిల్లా ముధోల్‌కు చెందిన నిహారికతో వివాహం జరుగగా, వారిద్దరి మధ్య గొడవలతో విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి జీవితంపై విరక్తి చెందిన గంగాధర్ నాలుగైదు సార్లు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నెల 25న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకోగా, చుట్టుపక్కల వారు గుర్తించి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు.