మేతలాకుతలం | - | Sakshi
Sakshi News home page

మేతలాకుతలం

May 14 2026 12:37 AM | Updated on May 14 2026 12:37 AM

సాక్షి, అమలాపురం: దేశానికి వందల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తూ, జిల్లాలో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే వనామీ రొయ్యల సాగు రెండేళ్లుగా వరుస సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు కొనుగోలుదారులు సిండికేటుగా మారి.. ట్రంప్‌ సుంకాలు, పశ్చిమాసియా యుద్ధం సాకుగా చూపి ధరలు తగ్గించేస్తున్నారు. మరోవైపు ఫీడ్‌ (మేత) ధరలను సైతం కంపెనీలు భారీగా పెంచేసి రైతులను ముంచేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా చంద్రబాబు సర్కార్‌ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంపై వనామీ రైతులు మండిపడుతున్నారు. ఇప్పటి వరకు వనామీ రొయ్యల ధరలు తగ్గిపోతుండడం వల్ల నష్టపోతున్న రైతులకు ఇప్పుడు మేతల ధరలు పెరగడం పిడుగుపాటుగా మారింది. ఆయా రకాల వనామీ రొయ్యల మేతలు టన్నుకు రూ.8 వేల వరకు, ష్రింప్‌ (టైగర్‌ రొయ్యల) మేతను రూ.10 వేలకు కంపెనీలు పెంచేశాయి. జిల్లాలో వనామీ రొయ్యల సాగు మాత్రమే జరుగుతోంది. వనామీ మార్కెట్‌ నిలకడగా లేకపోవడం, అంతర్జాతీయంగా చిన్న అలజడి చోటు చేసుకున్నా ఆ వంకతో రొయ్యల ధరలు తగ్గించేస్తూ కొనుగోలుదారుల సిండికేటు రైతులను నిలువునా ముంచేస్తోంది. ఈ విపత్తు నుంచి కోలుకోలేకపోతున్న రైతులకు మేత ధరలు పెరగడం గోరుచుట్టుపై రోకలిపోటుగా మారింది.

2.25 లక్షల మెట్రిక్‌ టన్నుల మేత వినియోగం

ఎకరాకు సగటున రొయ్యల బరువు 50 కౌంట్‌ అనుకుంటే ఎకరా చెరువులో లక్ష వరకు పిల్లలను వదులుతున్నారు. సగటున ఎకరాకు 2 టన్నుల రొయ్యల దిగుబడి వస్తుంటే, 3 టన్నుల వరకు మేత వినియోగం అవుతోంది. రెండు పంటలు వేసుకుంటే 6 టన్నుల వరకు వినియోగం. కొంతమంది ఒకే ఏడాది మూడో పంట కూడా సాగు చేస్తున్నారు. దీనిని కూడా పరిగణనలోకి తీసుకుంటే 9 టన్నుల వినియోగించాల్సి ఉంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అధికారికంగా సుమారు 21 వేల ఎకరాల్లో వనామీ రొయ్యల సాగు జరుగుతోంది. అనధికారికంగా ఈ సాగు మరింత ఎక్కువగా ఉంటుంది. కనిష్టంగా సుమారు 35 వేల ఎకరాల్లో సాగు జరుగుతోందని అంచనా. తొలి పంట మొత్తం సాగు జరగగా, రెండో పంట 70 శాతం చెరువుల్లో అంటే సుమారు 24 వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు అంచనా. ఇక మూడో పంట 40 శాతం చెరువుల్లో అంటే సుమారు 14 వేల ఎకరాల్లో సాగువుతోంది. ఈవిధంగా జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 75 వేల ఎకరాలకు సరిపడా సాగు జరుగుతోంది. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 2.25 లక్షల మెట్రిక్‌ టన్నుల మేతను వినియోగిస్తున్నారని అంచనా. ఇప్పుడు మేత ధరలు టన్నుకు రూ.8 వేల వరకు పెరగడంతో ఇక్కడి వనామీ రైతులపై రూ.180 కోట్ల అదనపు భారం పడుతోంది.

ఆక్వా రంగాన్ని కుదిపేస్తున్న

మేత ధరల పెంపు

కోనసీమ, కాకినాడ జిల్లాల్లో

35 వేల ఎకరాల్లో సాగు

రెండు జిల్లాల రైతులపై

రూ.180 కోట్ల మేర భారం

Advertisement
 
Advertisement
Advertisement