అక్రమ కేసులపై ప్రత్యక్ష పోరు | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులపై ప్రత్యక్ష పోరు

May 14 2026 12:37 AM | Updated on May 14 2026 12:37 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్‌ కుమార్‌ (బన్నీ) కోరారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలనను గాలికొదిలేసి అరాచకంతో ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం కర్నూలు సిటీ అధ్యక్షుడు బాలు ఆత్మహత్యా యత్నానికి పోలీసు వేధింపులు, అక్రమ కేసులే కారణమని పేర్కొంటూ.. ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బన్నీ ఆధ్వర్యాన పార్టీ, యువజన విభాగం నేతలు కాకినాడ ఇంద్రపాలెం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బుధవారం ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి బన్నీ మాట్లాడుతూ, ఎటువంటి తప్పూ చేయకపోయినా కర్నూలులో యువజన నేత బాలుపై పోలీసులు సారా, డ్రగ్స్‌ పేరుతో తప్పుడు కేసులు నమోదు చేశారని అన్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. ఇటీవల యువతపై పోలీసుల వేధింపులు పెరిగిపోయాయనడానికి కర్నూలు ఘటనే ఉదాహరణన్నారు. బాలు కుటుంబానికి యువజన విభాగం అండగా ఉంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే తీవ్ర స్థాయిలో స్పందిస్తామని బన్నీ హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మళ్ల కిశోర్‌, జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన పార్టీ యువజన నేతలు ఉలవల భూషణం, సకురు గుర్రాజు, అడపా సోమేశ్వరరావు, కరణం భాను, మడద హేమంత్‌ కుమార్‌, మడిపల్లి రాజు, బోణం శంకర్‌, లంక సత్తిబాబు, చెక్క చక్రవర్తి, సీడీ కుమార్‌, దీపక్‌, యాసలపు పవన్‌, తోకల గోపి తదితరులు పాల్గొన్నారు.

ఫ వైఎస్సార్‌ సీపీ

యువ నేత రాగిరెడ్డి బన్నీ

ఫ కర్నూలులో అక్రమ అరెస్టులపై నిరసన

Advertisement
 
Advertisement
Advertisement