రెండో ఘాట్‌ రోడ్డు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

రెండో ఘాట్‌ రోడ్డు సిద్ధం

May 14 2026 12:37 AM | Updated on May 14 2026 12:37 AM

తుని రూరల్‌: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం రెండో ఘాట్‌ రోడ్డు పనులు పూర్తయ్యాయి. రెండు దశాబ్దాలుగా లోవ దేవస్థానానికి మొదటి ఘాట్‌ రోడ్డు మీదుగానే భక్తులు, వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. కొన్నేళ్లుగా వాహనాలు, భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆషాఢ మాసం, ఇతర పర్వదినాల్లో ఘాట్‌ రోడ్డులో తరచుగా ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రెండో ఘాట్‌ రోడ్డు నిర్మించాలన్న ధర్మకర్తలు, కార్యనిర్వహణాధికారి విజ్ఞప్తిపై డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ సంస్థ యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు రూ.70 లక్షలు అందించడంతో రెండో ఘాట్‌ రోడ్డు నిర్మించారు. దీనిని అధికారికంగా ప్రారంభించాల్సి ఉండగా.. ట్రయల్‌ రన్‌గా కొండపై నుంచి దిగువకు వెళ్లే వాహనాలను ఇప్పటికే ఈ రోడ్డు మీదుగా అనుమతిస్తున్నారు.

వరి రైతుకు కాస్త ఊరట

సాక్షి, అమలాపురం: ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్న జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరట కలిగించే ప్రకటన చేసింది. వరి ధాన్యానికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) క్వింటాల్‌కు రూ.72 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌ రూ.2,369 ఉండగా, పెంచిన ధరతో ఇది రూ.2,441కు చేరింది. గ్రేడ్‌–ఎ ధాన్యం ధర రూ.2,489 ఉండగా తాజా పెంపుతో రూ.2,461కు పెరిగింది. ఈ ధరలు వచ్చే ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు నుంచి అమలులోకి రానున్నాయి. కోనసీమ జిల్లా పరిధిలోని తూర్పు, మధ్య డెల్టాల్లో వరి సాగు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 2.3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా 1,31,500 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ఖరీఫ్‌, రబీ సీజన్లకు సంబంధించి సుమారు 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడిగా వస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల మీద 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలు ప్రకటించినట్టు చెబుతోంది. వాస్తవానికి రాష్ట్రంలోనే గోదావరి జిల్లాల్లో వరి పెట్టుబడి అధికంగా ఉంది. జిల్లాలో వ్యవసాయ రుణాల కోసం స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను టెక్నికల్‌ కమిటీ నిర్ధారించిన పెట్టుబడి ఖరీఫ్‌లో ఎకరాకు రూ.55 వేల నుంచి రూ.60 వేలు. ఖరీఫ్‌ సగటు దిగుబడి 29 బస్తాలు అంటే (21.75 క్వింటాళ్లు). క్వింటాల్‌ ఉత్పత్తికి రైతుకు అవుతున్న ఖర్చు రూ.2,528. ప్రభుత్వం ఇప్పుడు ఇస్తానన్నది రూ.2,441. అంటే ఖరీఫ్‌ సాగు చేస్తే రైతులకు మిగిలేది ఏమీ లేనట్టే. కేంద్రం చెబుతున్న పెట్టుబడికి 50 శాతం కలిపి కనీస మద్దతు ధర ఇవ్వాలంటే క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.3,792 ప్రకటించాలని కోనసీమ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

వివిధ పనులకు

రూ.34.5 కోట్లు

కాకినాడ రూరల్‌: జిల్లాలో వివిధ పనుల నిమిత్తం కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) నుంచి రూ.34.5 కోట్లు అందజేయాలని అధికారులు నిర్ణయించారు. వైస్‌ చైర్మన్‌, జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ అధ్యక్షతన, చైర్మన్‌ తలాటం సత్య ఆధ్వర్యాన కౌడా కార్యాలయంలో బుధవారం 2026– 27 బడ్జెట్‌ సమావేశం నిర్వహించారు. మిగులు బడ్జెట్‌ను ఆమోదించి, నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులకు రూ.16.5 కోట్లు, పురపాలక సంఘాలకు రూ.18 కోట్లు మంజూరు చేశారు. కౌడా సిబ్బంది, ప్లానింగ్‌ విభాగం అధికారులతో సమీక్షిస్తూ, అనధికార లే అవుట్ల నిర్మూలనకు, ఆదాయ వనరుల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కౌడా కార్యదర్శి కాళీబాబు, ప్లానింగ్‌ అధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement