రత్నగిరికి భక్తుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

రత్నగిరికి భక్తుల వెల్లువ

May 14 2026 12:37 AM | Updated on May 14 2026 12:37 AM

రత్నగిరికి భక్తుల వెల్లువ

అన్నవరం: రత్నగిరికి బుధవారం భక్తులు వెల్లువలా తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రమే అయ్యింది. రత్నగిరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 50 వేల మంది భక్తులు తరలి రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్‌ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంచిపెట్టారు. వ్రతాలు 2,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ స్వామివారికి పుష్పాలతో, అమ్మవారికి కుంకుమతో, శంకరునికి బిల్వ పత్రాలతో పూజలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement