కాకినాడ రూరల్: ఫీడ్ ధరలను తక్షణం తగ్గించి, ఆక్వా రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక్కడ బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై సంబంధిత పరిశ్రమల యాజమాన్యాలు రైతులు, ఆక్వా సంఘాలతో సమావేశం నిర్వహించిన తరువాత నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని అన్నారు. రాష్ట్రంలో ఆక్వా ఫీడ్ తయారీ సంస్థలు అత్యధికంగా టీడీపీ నేతలవే కావడంతో ధరలు పెంచుతున్నా ప్రభుత్వం చోద్యం చూసిందా అనే అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దిగుమతులపై సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో ఆక్వా ఫీడ్ ధరలు మరింత తగ్గించాలని, కానీ వ్యాపారులు రేట్లు పెంచడమేమిటని ప్రశ్నించారు. ఆక్వా ఫీడ్ తయారీ సంస్థలపై ప్రభుత్వానికి నియంత్రణ ఉందా అని నిలదీశారు. గతంలో ఇలాగే ధరలు పెంచినప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడుసార్లు తగ్గించారని నాగమణి గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఆక్వా రైతుల పక్షాన నిలవాల్సింది పోయి ఫీడ్ తయారీదార్లకు మద్దతుగా నిలవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేకి అనే విషయాన్ని మరోసారి నిరూపణ అయ్యిందని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.72 వేలున్న ఆక్వా ఫీడ్ ధర చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రూ.లక్షకు పెరిగిందని, తాజాగా తయారీ సంస్థలు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో అది కాస్తా రూ.1.15 లక్షలకు చేరుకుందని వివరించారు. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధ వాతావరణంతో ఆక్వా ఎగుమతుల్లో అనిశ్చితి నెలకొందని, తాజాగా ఫీడ్ తయారీ సంస్థల ధనదాహానికి ఆక్వా రైతులు మరింత కుదేలవుతున్నారని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం రైతుల పక్షాన నిలవాలని నాగమణి హితవు పలికారు.


