● తొలిరోజు 892 మంది హాజరు
● 45 మంది గైర్హాజరు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మశీ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2026 మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలిరోజు ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. కాకినాడ ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల, రాయుడుపాలెం సాఫ్ట్ టెక్నాలజీ, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి అందరూ గంట ముందుగానే చేరుకున్నారు. జిల్లాలో అక్కడక్కడా కొద్ది నిముషాల పాటు ప్రారంభ సమయంలో సర్వర్ సమస్య మినహా పరీక్షలు సజావుగా సాగాయి. పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించగా 892 మంది హాజరుకాగా 45 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 468 మందికి గాను 452 మంది హాజరుకాగా 16మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 469 మంది దరఖాస్తు చేసుకోగా 440 మంది హాజరయ్యారు. 29 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ మోహనరావు తెలిపారు.


