అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వ ‘పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ ఆగ్‌మంటేషన్ డ్రైవ్ ’ (ప్రసాద్’) స్కీం నిధులు రూ.11 .50 కోట్ల వ్యయంతో కడుతున్న అన్నదాన భవనంలో మరింత ఎక్కువ మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణంలో మార్పులు చేయనున్నారు. మంగళవారం అన్నవరం దేవస్థానానికి వచ్చిన టూరిజం, దేవదాయశాఖ శాఖ అధికారులు ఈ నిర్మాణాన్ని పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయించారు. మూడంతస్తులలో అన్నదాన భవనం నిర్మిస్తున్నారు. మూడు అంతస్తులలోని నాలుగు హాల్స్‌లో ఒక్కో హాలులో 350 మంది చొప్పున 1,400 మంది భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే ఈ భవనంలోని హాల్స్‌లో మెట్లు లోపల వైపు ఉండేలా ప్లాన్‌లో పొందుపరిచి ఆ మేరకు నిర్మిస్తున్నారు. గత నెలలో ఇక్కడికి వచ్చిన దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ ఈ భవనాన్ని పరిశీలించి మెట్లు లోపల కాకుండా భవనం బయట వైపు వస్తే ఒక్కో హాలులో 50 నుంచి వంద మంది అదనంగా భోజనం చేసే వీలుంటుందని సూచించారు. భోజనం చేసిన భక్తులు వినాయక అతిథిగృహం వెనుక నుంచి వెలుపలకు వచ్చేలా మార్పులు చేయాలని ఆదేశించారు. దేవదాయశాఖ సలహాదారు సుబ్బారావు, చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్, టూరిజం శాఖ ఎస్‌ఈ ఈశ్వరయ్య, ఈఈ విజయభాస్కరరెడ్డి, ఆర్కిటెక్ట్ బీకే సాధి, అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధర్‌రావు, ఈఈ వీ రామకృష్ణ పరిశీలించారు. మెట్లు భవనం వెలుపల కడితే నాలుగు హాల్స్‌లో 50 నుంచి వంద మంది భోజనం చేసే వీలుంటుందని తేల్చారు. భవనం ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు.


