సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికల్లో చెప్పిన మాటలు మూడు నెలలు తిరిగే సరికి ప్రజలు మరచిపోతారనే భ్రమలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ జనం మాత్రం గద్దె నెక్కి రెండేళ్లు అయినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిలదీస్తున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 40వేల ఎకరాల్లో వరి సాగును ప్రశ్నార్థకం చేసిన తాళ్లూరు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో జరుగుతోన్న జాప్యంపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ఏడాది తిరగకుండా తాళ్లూరు ఎత్తిపోతలను పట్టాలెక్కించి మెట్టను సస్య శ్యామలం చేస్తానని అధికార పార్టీ నేతలు గొప్పగా ప్రకటించారు. ఎమ్మెల్యే, టీటీడీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఈ ఎత్తిపోతలను భుజాన కెత్తుకున్నారు. చంద్రబాబు గద్దె నెక్కిన తరువాత రెండు సీజన్‌లు సాగునీరు రాక పంట కోల్పోయారు.
పఽథకాన్ని ప్రారంభించిన వైఎస్సార్
మెట్ట ప్రాంతంలో ఐదు మండలాల్లో 25 గ్రామాల పరిధిలో సుమారు 40వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ఈ ఎత్తిపోతలపై ప్రభుత్వ ఉదాసీనత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గోదావరి జలాలను మెట్ట ప్రాంతానికి తరలించే లక్ష్యంతో 2008 మార్చిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పఽథకాన్ని ప్రారంభించారు. 1.85 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో సీతానగరం, కోరుకొండ, గోకవరం, రాజానగరం, గండేపల్లి, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని మండలాల వరకు కాలువ తవ్వారు. కాలువపై జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలంలో తాళ్లూరు లిఫ్ట్‌ను 2009లో అప్పటి ఎమ్మెల్యే తోట నరసింహం ప్రారంభించారు. సుమారు 37 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే లక్ష్యంతో రూ.30 కోట్లతో ఈ ఎత్తిపోతలను ఏర్పాటు చేశారు. జగ్గంపేట మండలం రాజపూడి లిఫ్ట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ ద్వారా 5,500 ఎకరాలకు సాగునీరందేది. సుమారు 3.5 కిలోమీడర్ల పొడవు ఉన్న ఈ పైపులైన్‌లో సుమారు 2,200 పైపుల ద్వారా నీటిని తోడి కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరందించే వారు. కుడి కాలువ ద్వారా జగ్గంపేట మండలం ఇర్రిపాక వరకు, ఎడమ కాలువ ద్వారా గండేపల్లి మండలం మురారి వరకు పంట పొలాలకు సాగునీరందేది. అనంతరం జగ్గంపేట, గండేపల్లి మండలాలతో పాటు ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రాజానగరం మండలాల్లోని 25 గ్రామాలకు సాగునీరు సరఫరా అయ్యేది. ఐదు మోటార్లు, మూడు పైపులైన్ల ద్వారా నీటిని తోడి పంట పొలాలకు సాగునీరు సరఫరాచేసే వారు. సిమెంట్ పైపులైన్‌లో విద్యుత్ అంతరాయం, మోటార్లు రిపేరు వచ్చిన సందర్భాల్లో నీరు హై ప్రెషర్‌తో వెనక్కి వచ్చి పైపులైన్లు పగిలిపోయేవి. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఇటువంటి సాంకేతిక సమస్యలను యుద్ధప్రాతిపదికన చక్కదిద్ది పుష్కర ఎత్తిపోతల పఽథకం ద్వారా 2019 నుంచి 2022 వరకు రెండు సీజన్‌లకు పుష్కలంగా సాగునీటిని సరఫరా చేశారు. అనంతరం పైపులైన్లు మరమ్మతులకు రావడం, ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో పైపులైన్ మరమ్మతు పనులు నిలిచిపోయాయి.
పనులు ఎప్పటికి పూర్తవుతాయి?
చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక పైపులైన్ మరమ్మతులు చేపట్టనుండటంతో ఆయకట్టు రైతులకు నీరందించలేమని ప్రకటించారు. పైపులైన్ మరమ్మతులకు రూ.49 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. సిమెంట్ పైపులైన్లు స్థానే ఎంఎస్ పైపులైన్ వేయించి ఈ ఖరీఫ్‌కు పూర్తి స్థాయిలో నీరందిస్తామని ఎమ్మెల్యే నెహ్రూ రైతులకు హామీ ఇచ్చారు. మూడు నెలలవుతున్నా పనులు నత్తను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులో 2,200 పైపులకు ఇప్పటి వరకు కేవలం 300 పైపులు మాత్రమే బయటకు తీశారు. జూలై మొదటి వారంలో ఈ పథకం ద్వారా సాగునీరు అందివ్వాలంటే మిగిలి ఉన్న సమయం 60 రోజులు. ఈ 60 రోజులలో పంపు హౌస్ మోటర్లు, పంపులు మరమ్మతులు, సబ్‌స్టేషన్, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు, ప్రతి పైపు లోపల, బయట ఐరన్ మెష్‌తో కూడిన సిమెంట్ కాంక్రీట్ పొర వేయడం వంటి పనులు ఎప్పటికి పూర్తి అవుతాయని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.
ఖరీఫ్‌కు నీరు ఇచ్చేందుకు కృషి
పైపులు సిద్ధంగా ఉన్నాయి. పనులు జరుగుతున్న చోటుకు పది రోజుల్లో తీసుకువస్తాం. ఈ ఖరీఫ్‌కు నీరు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాం.
– రాజేశ్వరరావు, పుష్కర పోలవరం ఈఈ
తాళ్లూరు ఎత్తిపోతల పథకం
పైపులైన్లను వెలికి తీస్తున్న పొక్లెయిన్లు
నత్తను తలపిస్తున్న ‘తాళ్లూరు’
ఎత్తిపోతల పథకం పనులు
పూర్తికాక అన్నదాతలకు ఇబ్బంది
బీడువారిన 40 వేల ఎకరాలు
జగన్ హయాంలో సమృద్ధిగా సాగునీరు
సర్కార్ తీరుపై రైతుల నిప్పులు
ప్రతి వారం సమీక్షించాలి
అత్యవసర పనులు సకాలంలో పూర్తి చేసినప్పుడే ఈ పథకం పూర్తిస్థాయిలో రైతులకు ఉపయోగపడుతుంది. ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష జరపాలి.
– పాటంశెట్టి సూర్యచంద్ర,
ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి,
జగ్గంపేట.
మూడేళ్లుగా బీడు వారి..
ఈ ఏడాదితో కలిపితే మూడేల్లు వరుసగా సాగునీరు అందక పంటపొలాలు బీడులుగా మారిపోయాయి. గండేపల్లి, జగ్గంపేట తదితర మండలాల్లో సుమారు 25 గ్రామాల్లోని ఆయకట్టు వృథాగా మారిపోయింది.
– కర్ణాకుల వీరాంజనేయులు,
ఏపీ ఆర్‌సీఎస్ రాష్ట్ర కార్యదర్శి
మాకు జీవన్మరణ సమస్య
వర్షాధారిత కాలువలపై ఆధారపడే రైతులకు నీటి లభ్యత అనేది జీవన్మరణ సమస్యగా మారింది. చెరువులు, కాలువలు ఎండిపోయి బోర్లు కూడా మొరాయించడం వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
– మన్యం రామకృష్ణ, రైతు, తాళ్లూరు,
గండేపల్లి మండలం


