బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌వో) ఆర్‌ఎస్‌ఎస్ సత్యనారాయణరాజు బదిలీ అయ్యారు. వెంటనే విధులు నుంచి రిలీవ్ అయి రాష్ట్ర పౌరపరఫరాల శాఖ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెల్సింది. ఆయన 13 నెలల క్రితం జిల్లా డీఎస్‌వోగా నియమితులయ్యారు. ఇటీవల కాలంలో ఆయన రైస్‌మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేయడంతోపాటు కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేయాలని జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌ను పట్టుబట్టడంతో ఆయనను బదిలీ చేసినట్లు తెలిసింది. డీఎస్‌వోగా ఎవరినీ నియమించలేదు. జిల్లా అసిస్టెంట్ సివిల్ సప్లయి అధికారి తుమ్మల లక్ష్మీప్రసన్నను ఇన్‌చార్జి డీఎస్‌వోగా నియమించనున్నారు.
మద్యం తాగి బైక్ నడిపిన
వారికి జైలు
కాకినాడ లీగల్: మద్యం తాగి బైక్ నడిపిన కేసుల్లో ముగ్గురికి మూడురోజుల చొప్పున, ఒకరికి రెండు రోజులు, ఇద్దరికి ఒకరోజు చొప్పున జైలు శిక్ష, 16 మందికి ఒక్కొక్కరికి రూ.పదివేల జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చింతా నాగేంద్రరావు తీర్పుచెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. సోమవారం కోర్టులో హాజరుపర్చగా ఆరుగురికి జైలు శిక్ష, 16 మందికి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
మూడో రోజూ అదే రద్దీ
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం మూడు రోజులుగా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. వరుసగా మూడోరోజు సోమవారం సుమారు 40 వేల మంది భక్తులు రత్నగిరి సత్యదేవుని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న వివాహాల నేపథ్యంలో నవ దంపతులు, వారి బంధువులు, వేసవి సెలవుల కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ భక్తులు పోటెత్తడంతో సత్యదేవుని సన్నిధి కిటకిటలాడుతోంది. సత్యదేవుని సన్నిధిలో సోమవారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది.సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. సుమారు ఐదువేల మందికి అన్నదానంలో భోజన సౌకర్యం కల్పించారు.
ఆవును హతమార్చిన పులి
రాజవొమ్మంగి: చిరుత పులి మళ్లీ రాజవొమ్మంగి మండలంలోకి ప్రవేశించింది. సోమవారం చికిలింత గ్రామంలో రైతు సోమరాజుకు చెందిన ఆవును హతమార్చింది. ఈ విషయం తెలుసుకున్న రాజవొమ్మంగి అటవీ క్షేత్రాధికారి ఉషారాణి తమ సిబ్బందితో వెళ్లి పులి చికిలింత, వాతంగి, పెదగర్రంగి పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పుట్టినరోజు వేడుకలకు వచ్చి..
రంపచోడవరం: స్నేహితులతో కలసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. రంపచోడవరం మండలం బోర్నగూడెం గ్రామం శివారున ఈ ఘటన జరిగింది. రాజానగరం మండలం నందరాడకు చెందిన మేడిశెట్టి తరుణ్ కుమార్ (35) పుట్టినరోజు వేడుకలు జరుపుకొనేందుకు ముసురుమిల్లి ప్రాజెక్టు వద్దకు రెండు బైక్‌లపై నలుగురు యువకులు వచ్చారు. ముసురుమిల్లి ప్రాజెక్టు సమీపంలో ఇద్దరు స్నేహితులు ఉండగా, తరుణ్‌కుమార్, ఈలి ప్రవీణ్‌లు కేక్, బిర్యానీ తేవడానికి మోటార్ సైకిల్‌పై రంపచోడవరం బయలు దేరారు. బోర్నగూడెం శివారున ఎదురుగా ఆటో వచ్చి మోటార్ సైకిల్‌ను ఢీకొంది. తరుణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈలి ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ సన్యాసినాయుడు, ఎస్సై రాంబాబు పరిశీలించారు.


