అవే అర్జీలు పదే పదే | - | Sakshi
Sakshi News home page

అవే అర్జీలు పదే పదే

May 12 2026 12:20 AM | Updated on May 12 2026 12:20 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): సంవత్సరాల తరబడి పీజీఆర్‌ఎస్‌ చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ప్రజలు వాపోయారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి వచ్చి అర్జీలు ఇచ్చినా వాటిని పరిష్కరించకపోవడంతో పదే పదే రావాల్సి వస్తోందని ప్రజలు మండిపడుతున్నారు.

రెండేళ్లుగా తిరుగుతున్నాను

నాకు తల్లిదండ్రుల ద్వారా వచ్చిన భూమిని సాగు చేసుకొంటే సొంత అన్నయ్య ఇబ్బందులు పెడుతున్నాడు. ఇటీవల నా పొలంలో ఉన్న వరిని కోసి ధాన్యం రైస్‌మిల్లుకు తరలిస్తుండగా అడ్డుపడి ఇబ్బందులు పెట్టాడు. ఇప్పటికే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అనేక సార్లు ఫిర్యాదు చేశాను. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. రెండు సంవత్సరాలుగా పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నాను.

– గొల్లపల్లి వరలక్ష్మి, దుర్గాడ, గొల్లప్రోలు మండలం

ధాన్యం తక్కువ ధరకు కొంటున్నారు

కష్టపడి ధాన్యం పండించిన రైతులకు మద్దతు ధర లభించడం లేదు. తేమ పేరుతో రైస్‌మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారు. రబీలో బస్తా ధాన్యం రూ.1,779 కాగా తేమ పేరుతో దళారులు, మిల్లర్లు కుమ్మక్కయి రూ.300కు పైగా కోత విధిస్తున్నారు. తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి, రైతు సేవా కేంద్రాల్లో తప్పుడు పేర్లతో మద్దతు ధర పొందుతున్నారు. దీనికి కొందరు అధికారులు సహకరిస్తున్నారు.

– దడాల బుజ్జిబాబు, రైతు, జెల్లవారిపేట, తాళ్లరేవు మండలం

పింఛన్‌ కోసం తప్పని పాట్లు

భర్త చనిపోయి, ప్రస్తుతం కాళ్లు చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్న నాకు పింఛన్‌ ఇవ్వాలని ఏడాది నుంచి తిరుగుతున్నాను. ఎవరూ పట్టించుకోవడం లేదు. సచివాలయంలో అర్జీ ఇవ్వాలని చెబుతున్నారు. అక్కడ అర్జీ ఇస్తే కాకినాడలోనే పింఛన్‌లు మంజూరు చేస్తారని చెబుతున్నారు. తిరిగి తిరిగి ఇబ్బందులు పడుతున్నాను. నాకు పింఛన్‌ ఇప్పించి పుణ్యం కట్టుకోండి.

– అగ్రహారపు రమణమ్మ, పిఠాపురం

Advertisement
 
Advertisement
Advertisement