● నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
● జిల్లాలో ఆరు కేంద్రాల ఏర్పాటు
● ఇంజినీరింగ్ 5,701 మంది, అగ్రికల్చర్ ఫార్మాలో 2,963 మంది
● రెండు విభాగాలకు నలుగురు దరఖాస్తు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, ఫార్మశీ, అగ్రికల్చర్(బైపీసీ) కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ–2026 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ బాధ్యతను ఈ ఏడాది జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించారు. ఈ నెల 12, 13, 14, 15, 18 తేదీల్లో ఇంజినీరింగ్ విభాగాలకు, 19, 20 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మశీ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 5గంటల వరకూ పరీక్షలు సాగుతాయి. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 7.30 నుంచి, మధ్యాహ్నం పరీక్ష సమయానికి గంట ముందు ప్రవేశానికి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైనా ప్రవేశానికి అనుమతించరు. జిల్లావ్యాప్తంగా ఇంజినీరింగ్‌లో 5,701 అగ్రికల్చరల్, ఫార్మా విభాగంలో 2,963 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. రెండు విభాగాలకు కలిపి నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఐదు ఆన్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పరీక్షా కేంద్రాలివే...
కాకినాడ సాఫ్ట్ టెక్నాలజీ (రాయుడుపాలెం), అచ్యుతాపురం గేట్ వద్ద గల అయాన్ ఇనిస్టిట్యూట్, సూరంపాలెంలోని ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో 3 కేంద్రాలు.
హెల్ప్ లైన్ నంబర్... 0884–2342499,2359599
ఏర్పాట్లు పూర్తి
పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఏపీతో పాటు హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహిస్తాం.
– ప్రొఫెసర్ ఎన్.మోహనరావు,
కన్వీనర్, ఈఏపీ సెట్


