● చంద్రబాబు సర్కార్ దుబారా ఖర్చులు
● వైఎస్సార్ సీపీ మహిళా నేత నాగమణి
కాకినాడ రూరల్: దేశ ఆర్థిక పరిస్థితి, వివిధ దేశాల మధ్య యుద్ధాల వల్ల ఎదుర్కొంటున్న ఒడిదొడుకులను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ చేసిన సూచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు పాటించడం లేదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ప్రశ్నించారు. కాకినాడలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధించలేకపోతున్నా ఖర్చులు మాత్రం అదుపులో ఉండటం లేదన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చేస్తున్న దుబారా ఖర్చులు రాష్ట్ర ఖజానాకు ముప్పుగా పరిణమించాయన్నారు. రాజధాని అమరావతి నిర్మాణాల పేరిట చేస్తున్న వ్యయాలు అనాలోచిత చర్యలుగా ఉన్నాయన్నారు. ప్రజా సంఘాలు, మేధావులు చెబుతున్నా చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సంపద సృష్టిస్తామని అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు వారం వారం అప్పులతో నెట్టుకువస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రూ.లక్షల కోట్లు అప్పులు చేయడం తప్ప సాధించిన ఆర్థికాభివృద్ధి ఎక్కడ అని నిలదీశారు. కూటమి భాగస్వామిగా చంద్రబాబు కేంద్రం నుంచి నిధులు సాధించడంలో వెనుకబడ్డారని అన్నారు. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ రెండేళ్లలో సుమారు రూ.11 వేల కోట్ల నిధులు మురిగిపోవడం వారి చేతకాని తనమన్నారు. చంద్రబాబు సర్కార్ పనితీరుతో ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతోందన్నారు. ప్రధాని మోదీ సూచనలకు చంద్రబాబు విలువ ఇవ్వాలని, ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల ఖర్చులు అదుపులో ఉంచుకోవాలని నాగమణి హితవు పలికారు.


