జీతమో నారా చంద్రా! | - | Sakshi
Sakshi News home page

జీతమో నారా చంద్రా!

May 11 2026 7:38 AM | Updated on May 11 2026 7:38 AM

మూడు నెలలుగా కాంట్రాక్టు

ఉద్యోగులకు అందని వేతనాలు

అప్పుల పాలై అష్టకష్టాలు

నిర్దిష్ట ప్రణాళిక లేకుండా నిధి పోర్టల్‌కు వివరాల బదలాయింపు

ఎక్స్‌టెన్షన్‌ జీఓ జారీ చేయని ప్రభుత్వం

ఉద్దేశపూర్వక తాత్సారమేనని

కార్మికుల ఆవేదన

కాకినాడ క్రైం: వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని విభాగాల్లో సగానికి పైగా కష్టం వీరిదే. మరికొన్ని విభాగాలు ఏకంగా వీరి మీదే ఆధారపడి నడుస్తున్నాయి. రెగ్యులర్‌ ఉద్యోగుల్లో కొందరు వీరికి కనీస గౌరవ మర్యాదలైనా ఇవ్వరు. వారి కంటే ఎక్కువ విద్యార్హతలే ఉన్నా, కేడర్‌ పరంగా సమానులే అయినా తమ దయాదాక్షిణ్యాలతోనే వారు బతుకుతున్నట్లు భావిస్తారు. ఇన్ని కష్టాల మధ్య ఉద్యోగాలు చేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది జీతం రెగ్యులర్‌ ఉద్యోగులతో పోలిస్తే నాలుగింతలు తక్కువే. ఇన్ని కష్టాల మధ్య విధులు నిర్వహిస్తున్న వీరికి ఇస్తున్న జీతమే అరకొర. అది కూడా మూడు నెలలుగా చెల్లించకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు నానా అవస్థలూ పడుతున్నారు. జిల్లాలోని వివిధ విభాగాల్లో కాంట్రాక్టు విధానంలో పని చేస్తున్న ఉద్యోగులు సుమారు 7 వేల మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వారే. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో వీరందరూ అప్పుల పాలై అష్టకష్టాలు పడుతున్నారు.

ఎందుకిలా..

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టు ఉద్యోగులు నానా పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా మార్చి నెలాఖరుకు ఇవ్వాల్సిన కాంట్రాక్టు వ్యవధి పొడిగింపు ఉత్తర్వులను చంద్రబాబు ప్రభుత్వం ఈసారి ఇవ్వలేదు. ఆర్థిక శాఖ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఉత్తర్వులు ఇప్పటి వరకూ వెలువడలేదు. మరోవైపు నిధి పోర్టల్‌లో ఇప్పటికే రెగ్యులర్‌ ఉద్యోగుల వివరాలు నమోదు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు, విధి నిర్వహణ నమోదును సీఎఫ్‌ఎంఎస్‌ నిర్వహిస్తోంది. ఈ విధానంలో ఉద్యోగి విధుల వివరాలు ట్రెజరీకి, అక్కడి నుంచి జీతాల కోసం ఆర్థిక శాఖకు చేరేవి. అయితే, ఆళ్లగడ్డలోని ఓ ప్రభుత్వ విభాగంలో ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులుండగా, ఏడుగురి పేరిట జీతాలు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను కూడా రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే నిధి పోర్టల్‌లో చేర్చాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు నిధి పోర్టల్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు నమోదు చేస్తుండగా అనేక సాంకేతిక సమస్యలు, ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. పోర్టల్‌లో అప్‌లోడ్‌ అయి ఉన్న వివరాలకు, సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా నిర్వహిస్తున్న వివరాలకు అనేక తేడాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మ్యాపింగ్‌లో లోపాలు తలెత్తుతున్నాయి. దీంతో నమోదు ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఆయా ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యకు, ప్రభుత్వ ఆమోదిత సంఖ్యకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. క్యాడర్‌ స్ట్రెంగ్త్‌తో సంబంధం లేకుండా అనేక విభాగాల్లో ఆయా హెచ్‌ఓడీలు తమకు నచ్చినట్లు ఉద్యోగాలు ఇచ్చేసుకున్నారని, జీతాలు కూడా డ్రా చేస్తున్నారని బట్టబయలైంది. దీంతో, అదనపు నమోదు విషయం తేల్చకుండా తర్వాత ఉద్యోగి వివరాలు పోర్టల్‌లో నమోదు చేయడం సాధ్యం కావడం లేదు.

ఎప్పటికి వస్తాయో!

నిధి పోర్టల్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు నమోదు పూర్తయిన వెంటనే జీతాలు పడతాయనుకుంటే ఉద్యోగులు తప్పులో కాలేసినట్లే. రెగ్యులర్‌ ఉద్యోగులు ఇదే విషయం చెబుతూ కాంట్రాక్టు ఉద్యోగులను తప్పుదారి పట్టించి, కార్యాలయాల్లో పనులు చేయిస్తున్నారు. నిధి పోర్టల్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను అప్‌లోడ్‌ చేయడం పూర్తయినా ప్రభుత్వం కాంట్రాక్టు వ్యవధి పొడిగింపు జీఓ ఇచ్చేంత వరకూ జీతాలు వచ్చే ప్రసక్తే లేదు. ఈ జీఓ జారీ పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉంది. ఆర్థిక లోటును సర్దుబాటు చేసుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే జీఓ జారీ చేయడంలో తాత్సారం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాబట్టి జీతాలు ఎప్పటికి అందుతాయనే విషయంపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

అమరావతికే కాదు.. మా జీతాలకూ కాస్త డబ్బులివ్వండి బాబూ!

ఎన్ని కష్టాలో...

కాకినాడ జీజీహెచ్‌లో పని చేస్తున్న ఓ కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సు విధుల్లో ఉండగా.. ఓ ఫైనాన్స్‌ కంపెనీ ఏజెంటు వార్డుకు వచ్చి నెలవారీ వాయిదాలు కట్టలేదని గొడవ చేశాడు. కొన్ని నెలలుగా జీతాలు రాలేదని, వచ్చిన వెంటనే బకాయిలన్నీ ఒకేసారి చెల్లించేస్తానని ఆ నర్సు బతిమాలుకున్నా కనికరించకుండా కేకలు వేసి, రోగులు, సహోద్యోగుల ముందు ఆ నర్సు పరువు తీశాడు. అక్కడి వారు సర్ది చెప్పి, ఆ వ్యక్తిని పంపించారు. అవమాన భారంతో స్టాఫ్‌ నర్సు కన్నీటిపర్యంతమైంది.

కలెక్టరేట్‌ డేటా ఎంట్రీ విభాగంలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కొన్ని నెలల క్రితం వివాహమైంది. భార్య గర్భం దాల్చిన సంతోషంలో ఆమెకు ఇష్టమైన ఓ ద్విచక్ర వాహనాన్ని ఫైనాన్స్‌లో కొని బహుమతిగా ఇచ్చాడు. కొన్నాళ్లు వాయిదాలు చెల్లించాడు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో వాయిదాలు కట్టలేకపోయాడు. గత బుధవారం ఆమె తన తండ్రితో కలసి ఆ వాహనంపై ఇంటి నుంచి ఆసుపత్రికి వెళ్తూండగా, ఫైనాన్స్‌ సంస్థ రికవరీ ఏజెంట్లు నడి రోడ్డుపై ఆపారు. గర్భిణి అనే కనికరం కూడా చూపకుండా వాహనాన్ని తీసుకెళ్లిపోయారు.

ఇటువంటి ఉదంతాలు కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలను ప్రస్తుతం కుదిపేస్తున్నాయి. తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, జీతాలు తక్షణం చెల్లించే ఏర్పాటు చేయాలని ఆ చిరుద్యోగులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement