రంగు బట్టబయలు | - | Sakshi
Sakshi News home page

రంగు బట్టబయలు

May 11 2026 7:38 AM | Updated on May 11 2026 7:38 AM

గోదారి కాలువలో కలుస్తున్న

పారిశ్రామిక వ్యర్థాలు

నీటి సరఫరా నిలిపిన వేళ

బయట పడిన కాలుష్యం

సామర్లకోట: వివిధ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య జలాలు గోదావరి కాలువలో కలసిపోతున్నాయని ఎంతో మంది ఎన్నో పర్యాయాలు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, కాలువలో కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. ప్రజల నుంచి తీవ్ర స్థాయి ఒత్తిడి వస్తే కాలువలో నీటి శ్యాంపిల్స్‌ తీసి, ఎటువంటి కాలుష్యం లేదని నిర్ధారణ చేసి చేతులు దులుపుకొంటున్నారు. కానీ, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సామర్లకోట కాలువకు నీటి సరఫరాను నిలిపివేసిన వేళ.. ఇందులో ఎంత కాలుష్యం ఉంటోందనే విషయం బయటపడుతోంది. ఇందులోని నీటి రంగు నల్లగా మారడమే దీనికి సాక్ష్యంగా కనిపిస్తోంది.

లక్షల మందికి ఇదే తాగునీరు

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సామర్లకోట వరకూ ఉన్న తూర్పు డెల్టా ప్రధాన కాలువ జలాలను సాగుకే కాకుండా, లక్షలాది మందికి తాగునీటిగా ఉపయోగిస్తున్నారు. సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీలు, కాకినాడ నగర పాలక సంస్థతో పాటు అనేక గ్రామాలకు చెందిన ప్రజలు ఈ కాలువ నీటినే దాహార్తి తీర్చుకునేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ కాలువ నుంచి వస్తున్న జలాలను పండూరు చెరువులో నింపి, కాకినాడ రూరల్‌ పరిధిలోని గ్రామాలకు సైతం తాగునీటిగా అందిస్తున్నారు. పిఠాపురం బ్రాంచి కెనాల్‌ (పీబీసీ) నుంచి వచ్చిన నీటిని సామర్లకోట మండలం కాపవరం గ్రామంలోని ఫిల్టర్‌ చెరువులో నింపి, అక్కడి నుంచి సామర్లకోట మండలంలోని అనేక గ్రామాలకు పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. సామర్లకోట మున్సిపాలిటీ ప్రజల కోసం ఉండూరు రోడ్డులో ఏర్పాటు చేసిన నాగార్జున చెరువులో గోదావరి జలాలను నింపుతారు. అలాగే, పెద్దాపురం, కాకినాడ నగర ప్రజల కోసం కాకినాడ రోడ్డులోని సాంబమూర్తి రిజర్వాయర్‌ చెరువులో ఈ నీటిని నింపి, అందిస్తారు.

కలుషితమవుతోందిలా..

ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ కాలువలోకి అనేక పరిశ్రమల నుంచి కాలుష్య జలాలను యథేచ్ఛగా వదిలేస్తున్నారు. కాలువ పూర్తిగా నీటితో నిండి ఉన్న సమయంలో నీరు రంగు మారినా గుర్తించలేని పరిస్థితి. ప్రస్తుతం కాలువకు నీటి సరఫరాను నిలిపివేయడంతో కాలుష్య జలాల రంగు బయటపడింది. సామర్లకోట – పెద్దాపురం రోడ్డులోని పరిశ్రమ నుంచి కాలుష్య జలాలు వేట్లపాలెం మీదుగా గోదావరి కాలువలో కలుస్తున్నాయి. ఈ విషయాన్ని అధికారులు గుర్తించి, ఆ పరిశ్రమకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ, కాలుష్య జలాలకు అడ్డుకట్ట పడలేదు. రాత్రి వేళ ట్యాంకర్లతో కాలుష్య జలాలు తీసుకుని వచ్చి మరీ గోదావరి కాలువలో వదిలేస్తున్నారు. ఫలితంగా గోదావరి కాలువలో మిగిలి ఉన్న నీరు నల్లని రంగులోకి మారిపోయింది. వేసవిలో ఈ కాలువలో మిగిలి ఉన్న నీటినే పశువులు తాగుతూంటాయి. ఈ నీరు కాస్తా కలుషితమవడంతో పశువులు అనారోగ్యానికి గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కాలుష్య జలాలకు అధికారులు చెక్‌ పెడతారేమో చూడాలి.

పంటలకు నష్టం

గోదావరి కాలువలో కాలుష్య జలాల కారణంగా వరి పంట తెగుళ్ల బారిన పడుతోంది. వేసవిలో గోదావరి కాలువ మూసివేసిన సమయంలో ఉన్న కొద్దిపాటి నీటిని పశువులు తాగుతాయి. ప్రస్తుతం ఉన్న నీటిలో దిగుతున్న పశువుల కాళ్లకు పుండ్లు పడుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అనేక మంది గోదావరి కాలువలో స్నానాలు చేస్తారు. పవిత్రమైన గోదావరి కాలువను కలుషితం చేయడం సరి కాదు. కాలుష్య జలాలను నివారించాలి.

– వల్లూరి వెంకట రమణ, రైతు, సామర్లకోట

సమన్వయంతోనే నివారణ

గోదావరి కాలువలో కాలుష్య జలాల నివారణ మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ అధికారులతో సాధ్యం కాదు. రెవెన్యూ, ఇరిగేషన్‌, కాలుష్య నియంత్రణ మండలి, పంచాయతీరాజ్‌ అధికారులతో పాటు మున్సిపల్‌ అధికారులు టీములుగా ఏర్పడి, కాలుష్య నివారణకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి.

– కేటీ సుధాకర్‌, అదనపు కమిషనర్‌,

కాకినాడ నగర పాలక సంస్థ

Advertisement
 
Advertisement
Advertisement