ఏలేశ్వరం: ఎగువ నుంచి ప్రవాహం అంతంత మాత్రంగానే ఉండటం, అడపాదడపా వర్షాలు కురుస్తున్నా తీవ్రమైన ఎండలు కాస్తూండటంతో ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా తగ్గుతున్నాయి. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, ఆదివారం 76.53 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను 9.72 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. పంటల సాగు ముగియడంతో ఆయకట్టుకు నీటి విడుదలను నిలిపివేశారు. విశాఖపట్నానికి 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పంపా, తిమ్మరాజు చెరువులకు కూడా నీటి సరఫరాను నిలిపివేశారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజాము ముహూర్తాల్లో రత్నగిరి పైన, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోను వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, బంధువులతో పాటు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో సత్యదేవుని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత మండపాలు భక్తులతో కిక్కిరిశాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 2 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది.
లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: లోవ దేవస్థానానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 21 వేల మంది భక్తులు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.1,78,200, పూజా టికెట్లకు రూ.2,33,510, కేశఖండన శాలకు రూ.16 వేలు, వాహన పూజలకు రూ.3,980, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.61,860, విరాళాలు రూ.31,531 కలిపి మొత్తం రూ.5,25,081 ఆదాయం సమకూరిందని వివరించారు.
ఆటోడ్రైవర్ నిజాయతీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తన ఆటోలో ప్రయాణికురాలు మరచిపోయిన పర్సును తిరిగి ఆమెకు అప్పగించి తన నిజాయతీని చాటుకున్నాడు రాజమహేంద్రవరంలోని ఓ ఆటో డ్రైవర్. కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తున్న మహిళ క్వారీ సెంటర్ వద్ద ఆటో ఎక్కి కోటగుమ్మం సెంటర్‌లో దిగింది. అనంతరం, ఆమె తన పర్సును ఆటోలో మరచిపోయినట్టు గుర్తించింది. ఆ ఆటో చుట్టుపక్కల ఉందేమోనని వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో ఆమె త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అదే సమయంలో ఆటో డ్రైవర్ తన ఆటోలో ఓ మహిళ పర్సు మరచిపోయిందంటూ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి పోలీసులకు అప్పగించాడు. ఫిర్యాదు చేసిన మహిళ చెప్పిన వివరాలతో సరిపోల్చిన పోలీసులు.. ఆ పర్సు ఆమెదేనని నిర్ధారించి అందజేశారు. పోగొట్టుకున్న పర్సు తిరిగి దొరకడంతో మహిళ ఆనందం వ్యక్తం చేసింది. నిజాయతీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్‌ను త్రీటౌన్ సీఐ వి.అప్పారావు, ఎస్సై వి.అప్పలరాజు, సిబ్బంది అభినందించారు.


