అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయ ప్రాంగణంలో ఆదివారం కార్పెట్లు పరిచారు. ఎండ వేడికి కాళ్లు కాలి దేవస్థానానికి వస్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నా ఆలయ ప్రాంగణంలో కార్పెట్లు వేయకపోవడంపై ‘కార్పెట్లు ఎక్కడ స్వామీ?’ శీర్షికన ‘సాక్షి’ ఆదివారం వార్త ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు పశ్చిమ రాజగోపురం నుంచి ఆలయం లోపలకు వెళ్లే మార్గంలోను, అన్నదానం విభాగం మార్గంలోను, రథపాత్‌లోను కార్పెట్లు వేశారు. దీనిపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే, గతంలో కూడా ‘సాక్షి’ వార్తలు ప్రచురించినప్పుడు అధికారులు స్పందించి, కార్పెట్లు వేసినప్పటికీ నాలుగు రోజులకే తీసేశారు. ఈసారి అలా చేయకుండా ఎండాకాలమంతా ఉంచాలని భక్తులు కోరుతున్నారు.


