ప్రత్తిపాడు రూరల్: ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేస్తూ త్వరితగతిన అందించడమే లక్ష్యంగా ప్రత్తిపాడులో అదనపు కోర్టును ప్రారంభించామని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పోర్ట్‌ఫోలియో ఇన్‌చార్జి న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, బీఎల్‌వీ చక్రవర్తి, జగడం సుమతి అన్నారు. ప్రత్తిపాడులో అదనపు కోర్టును ఆదివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కోర్టు ఏర్పాటు వలన పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారమవుతాయని ఆకాక్షించారు. కక్షిదారులకు తక్కువ కాలంలో న్యాయం చేయడమే ఈ కోర్టు ప్రధానోద్దేశమని వారు తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోషియేషన్ అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి బొంగులూరి మధుబాబు, ఉపాధ్యక్షులు అడారి గుణ, ట్రెజరర్ అవసరాల దేవి తదితరులు పాల్గొన్నారు.
డ్రోన్ నిఘాలో..
కాకినాడ రూరల్: వేసవి సెలవులు, ఆపై ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులకు రక్షణ కల్పించేలా కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్‌లో జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఏర్పాటు చేసింది. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో బీచ్‌తో పాటు పరిసర ప్రాంతాలను పర్యవేక్షించారు. తిమ్మాపురం పోలీసులతో పాటు వివిధ స్టేషన్ల సివిల్ పోలీసులు, మైరెన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


