● చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు
● రైతుకు ‘మద్దతు’లేని ధర
● తేమ పేరుతో దళారుల దోపిడీ
● ఎకరాకు రూ.10 వేలు నష్టం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రబీ దిగుబడి నింపిన జోష్ రైతులకు మూడునాళ్ల ముచ్చటగానే మిగిలింది. దిగుబడి బాగున్నా అకాల వర్షాలు రైతుల కొంప ముంచేశాయి. ప్రకృతి కన్నెర్రజేయడం సరిపోదన్నట్టు దళారులు కూడా రైతును నిలువునా దోచుకుంటున్నారు. ప్రభుత్వం చెప్పిన మద్దతు ధర రైతుల దరిచేరడం లేదు. చంద్రబాబు పాలనలో దళారుల దోపిడీ రాజ్యమేలుతోంది. జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న మాసూళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈ తరుణంలో కూడా ప్రభుత్వ నిర్వాకంతో రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యానికి తేమ సాకుతో ప్రతి బస్తాకు అదనంగా నాలుగు కేజీలు తూకం వేసుకుపోతున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని సీఎంఆర్‌కు విక్రయిస్తే ఎకరాకు రూ.11 వేలు పైనే నష్టపోతున్నామని కరప, కాకినాడ రూరల్, పిఠాపురం, సామర్లకోట ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధాన్యం కోతలు పూర్తిచేసి మాసూళ్లు చేసి ధాన్యాన్ని సిద్ధం చేసి తొమ్మిది రోజులైనా తేమశాతం పేరుతో కొనుగోలు చేయడం లేదని సామర్లకోట మండల రైతులు ఆవేదన చెందుతున్నారు. కళ్లాల్లో ధాన్యం విక్రయించడానికి తీవ్రంగా ఎదురుచూడాల్సి వస్తోందని వారంటున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఽ
ఈ ఏడాది రబీ సీజన్‌లో ఎంటీయు 3626 (బొండాలు), టాటా బొండాలు రకాలను ఎక్కువగా సాగుచేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగింది. జిల్లాలోని పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లోని ఆయకట్టులో ఎకరాకు 45 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. సారవంతమైన భూముల్లో 55 బస్తాల దిగుబడి కూడా నమోదైంది. ఇదే అదునుగా వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నట్టు రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన కనీస మద్దతు ధర 75 కిలోల బస్తాకు సాధారణ రకం రూ.1725, ఏ గ్రేడ్ రకానికి రూ.1779 రావాలి. కానీ జిల్లాలో ఎక్కడా ఈ ధరకు కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. రబీ సీజన్‌లో రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఆర్‌ఎస్‌కేలోని సిబ్బంది రైతు కళ్లాల్లోకి వెళ్లి మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఎక్కడా అమలు కావడం లేదు.
కమీషన్ వ్యాపారులే రైతుల నుంచి పాస్‌బుక్‌లు, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్‌లు తీసుకువెళ్లి నమోదు చేయిస్తున్నారు. వ్యాపారులే తమ సిబ్బందితో ధాన్యం పట్టుబడి చేయించి, ట్రాక్టర్‌ల ద్వారా రైసుమిల్లులకు చేరవేస్తున్నారు. కమీషన్ వ్యాపారులు నగదు రూపంలో రూ.1600 కు కొనుగోలు చేస్తున్నారు. ఈ పద్ధతిలో ధాన్యం విక్రయిస్తున్న రైతులు ప్రతి బస్తాపై రూ.177 నష్టపోతున్నారు. ఎకరాకు 50 బస్తాలు దిగుబడి వస్తుందనే లెక్కలతో చూస్తే రూ.8,850 నుంచి రూ.10 వేలు రైతు నష్టపోతున్నాడు. అదే సీఎంఆర్ ద్వారా అయితే 75 కిలోల బస్తా రూ.1700కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. రవాణా, ఇతర చార్జీలు అంటూ మద్దతు ధర కంటే రూ.107 తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. తేమశాతం పేరుతో బస్తాకు రెండు కేజీలు, తప్ప, తాలు గింజల పేరుతో మరో కేజీ, కేళీ పేరుతో ఒక కేజీ.. ఇలా మొత్తంగా బస్తాకు నాలుగు కిలోల వంతున అదనంగా తూకం వేసుకుపోతున్నారు. ఇందుకు సమ్మతించని రైతుల ధాన్యాన్ని మిల్లర్లు తిప్పి పంపేస్తున్నారు. తెచ్చిన ధాన్యాన్ని తిరిగి తీసుకువెళితే ట్రాక్టర్ అద్దె ఇతర ఖర్చులు భరించలేక మిల్లర్లు పెట్టిన షరతులకు తలొగ్గి అయినకాడికు అమ్ముకోవాల్సి వస్తోందని కరప మండల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తేమ, పొల్లు, ధూగర అంటూ మిల్లర్లు కుంటిసాకులతో నాలుగు కిలోలు కోత పెడుతున్నారు. అంటే కిలోకు రూ.25 వంతున బస్తాకు రూ.182 నుంచి రూ.207 వరకు రైతులు నష్టపోతున్నారు.
తొమ్మిది రోజులైనా పట్టుబడి లేదు
ధాన్యం అమ్ముదామంటే దారి కనిపించడం లేదు. ధాన్యం కోతలు జరిగే 15 రోజులు గడిచిపోయింది. ధాన్యం పట్టుబడి జరిగే అవకాశం కనిపించడం లేదు. ధాన్యం పట్టుబడి పట్టి అమ్ముకుంటే అన్యాయమే జరుగుతుంది. తరుగు పేరుతో బస్తాకు రెండు కేజీలు తగ్గిస్తున్నారు. దాంతో ఎకరానికి సుమారు రూ.2000 నష్టం జరుగుతోంది. రవాణా ఇతర చార్జీల పేరుతో బస్తాకు రూ.200 తగ్గిస్తున్నారు. ఇలా రూ.9 వేల వంతున ఎకరానికి నష్టపోవాల్సి వస్తోంది. ధాన్యం కోత పూర్తి చేసి తొమ్మిది రోజులైనా ఇంతవరకు పట్టుబడి జరగలేదు.
– కాశి వెంకట్రావు, రైతు, సామర్లకోట
రైతుల పక్షాన ఉద్యమిస్తాం
రబీలో ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రచారానికే పరిమితమైంది. కళ్లాల్లో ధాన్యాన్ని అమ్ముదామంటే దళారులనే ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. మద్దతు ధరను పర్యవేక్షించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కలెక్టరేట్‌లలో ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏ రోజుకా రోజు రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. రైతుల రెక్కల కష్టాన్ని దళారులకు రాజ్యభోజ్యంగా విడిచిపెట్టి ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో రబీ కోతలు, మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సైతం ప్రభుత్వం వైపు నుంచి కనీస మద్దతు ధర అందించే బాధ్యత తీసుకోకపోవడం అన్యాయం. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకుంటే రైతుల తరఫున ఉద్యమిస్తాం.
– దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, కాకినాడ జిల్లా


