● తనిఖీల్లో గుర్తిస్తే తప్ప పట్టించుకోని
పాఠశాల యాజమాన్యాలు
● 15 రోజుల్లో సరిచేసి పాసైతేనే
సర్టిఫికెట్ ఇస్తున్న అధికారులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పిల్లలను తీసుకువెళ్లే పాఠశాల బస్సుల్లో సాంకేతిక సమస్యలు వారి తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. అధికారులు తనిఖీలు చేపట్టి గుర్తించి నోటీసులు ఇస్తే తప్ప ఆయా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో 1685 బస్సులు ఉండగా ఇప్పటివరకూ రవాణాశాఖ అధికారులు 19 బస్సులలో లోపాలు గుర్తించి ఆయా యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు.
గుర్తిస్తున్న లోపాలివీ..
వీఎల్‌టీడీ డివైజ్‌లు లేకపోవడం. అత్యవసర ద్వారాలు సరిగా పనిచేయకపోవడం. వాటి వద్ద సీట్లు అమర్చడం. ప్రమాదాల వేళ అద్దాలు పగులగొట్టేందుకు హ్యామర్లు, ఫైర్ ఎక్టింగ్విషర్లు అందుబాటులో లేకపోవడం. ఉన్నా కాలపరిమితి తీరినవి కావడం. అరిగిపోయిన, ఎలైన్‌మెంట్ సరిగా లేని వాహన టైర్లు. సమతులంగా లేని మెట్లు. ప్రధమ చికిత్స కిట్లు లేకపోవడం. ఇంటికేటర్లు, హెడ్‌లైట్లు, బస్సు అద్దం విజిబిలిటీ సరిగా లేకపోవడం.
గతంలో నమోదు చేసిన కేసులు..
గత ఏడాది డిసెంబర్‌లో రవాణా శాఖ పది ప్రత్యేక బృందాలతో వంద బస్సులను తనిఖీ చేశారు. డ్రైవర్ వయసు, అనుభవం, లైసెన్స్, వాహనం కండిషన్ తదితర అంశాలు తనిఖీ చేసి 20 బస్సులపై కేసులు నమోదు చేశారు. రానున్న విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ముందుగానే తనిఖీలు చేపడుతున్నారు.
లోపాలుంటే నోటీసులు ఇస్తున్నాం..
రవాణా శాఖ కమిషనర్ అదేశాల మేరకు జిల్లాలో స్కూళ్లు, కళాశాలల బస్సులను తనిఖీచేస్తున్నాం. భద్రత ప్రమాణాలతో పాటు వెహికల్ రూల్స్ ప్రకారం తనిఖీ చేస్తున్నాం. సక్రమంగా లేని బస్సుల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి 15 రోజుల్లో సరిచేసుకోవాలని ఆదేశిస్తున్నాం. అనంతరం మళ్లీ ఒకసారి తనిఖీ చేసి అన్నీ బాగుంటే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇస్తున్నాం.
– కె.శ్రీధర్, జిల్లా రవాణాశాఖాఽఽధికారి


