నాన్నమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు | - | Sakshi
Sakshi News home page

నాన్నమ్మకు తలకొరివి పెట్టిన మనవరాలు

May 10 2026 7:40 AM | Updated on May 10 2026 7:40 AM

రాజోలు: ఓ మనవరాలు తన నానమ్మకు తలకొరివి పెట్టి రుణం తీర్చుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజోలు సుందరమ్మ చెరువు గట్టు ప్రాంతానికి చెందిన గాలిదేవర సత్యవేణి (75) కిడ్నీ సమస్యతో బాధపడుతూ మృతి చెందింది. సత్యవేణికి ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసరావు 2021లో కరోనాతో మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహమై వేరొక ప్రాంతంలో నివాసం ఉంటోంది. నాన్నమ్మ సత్యవేణి ఆలనాపాలనా చిన్న మనుమరాలైన గాలిదేవర రేణుక చూసుకుంటోంది. దీంతో శనివారం రాజోలు కై లాసభూమిలో నానమ్మకు తలకొరివి పెట్టింది. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ తన తండ్రి శ్రీనివాసరావు కరోనాతో చనిపోయినప్పుడు అంత్యక్రియలు నిస్సహాయ స్థితిలో జరిగాయని, కనీసం మృతదేహాన్ని చివరిచూపు చూసేందుకు కూడా నోచుకోలేకపోయామని విలపించింది. నానమ్మ సత్యవేణికి తలకొరివి పెట్టి పితృరుణం తీర్చుకున్నాని కన్నీటి పర్యంతమైంది.

భారీ వర్షంతో అవస్థలు

జలమయమైన రహదారులు

రాజవొమ్మంగి: మండల వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో స్థానిక వారపు సంత వెలవెలబోయింది. వ్యాపారులు సరకులు సర్దుకొనేలోగా వర్షం కురవడంతో ఇబ్బంది పడ్డారు. ఈదురుగాలులతో రాజవొమ్మంగి నుంచి లాగరాయి వెళ్లే రహదారిపై చెట్టు కూలిపోవడంతో, చుట్టూ తిరిగి దూసరపాము గ్రామం మీదుగా రాకపోకలు సాగించారు. భారీ వర్షానికి రహదారులపై నీరు ప్రవహించింది. మడికట్టు నేలలో నీరు చేరింది. మండు వేసవిలో ఆకాశం–నేల ఒకటైనట్లు కురిసిన వానకు ప్రజానీకం అవాక్కయ్యింది. గిరిజనం అప్పుడే తొలకరి వచ్చేసిందా అన్న అనుభూతిని పొందారు. కాగా అప్పటి వరకు వేసవి వేడిమికి అల్లాడిన వారు వాతావరణంలో మార్పుతో చల్లగాలులు వీయడంతో సేద తీరారు.

Advertisement
 
Advertisement
Advertisement