ఐదు రైస్‌ మిల్లులకు షోకాజ్‌ నోటీసులు | - | Sakshi
Sakshi News home page

ఐదు రైస్‌ మిల్లులకు షోకాజ్‌ నోటీసులు

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో ఐదు రైస్‌ మిల్లులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు జేసీ అపూర్వ భరత్‌ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కరపలో పూర్ణోదయ ఆగ్రోపుడ్స్‌ రైస్‌ మిల్లు, శ్రీవెంకట సూర్య రైస్‌మిల్లు, పిఠాపురం మండలం బి.పత్తిపాడులో శ్రీ శివజ్యోతి రైస్‌ మిల్లు, శ్రీ సాయిబాలాజీ ఎంఆర్‌ఎం రైస్‌ మిల్లు, శ్రీ శివశంకర్‌ రైస్‌ మిల్లులకు నోటీసులు ఇచ్చామన్నారు. సీఎంఆర్‌ నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు ఏ, బీ రిజిస్టర్లను సరిగా నిర్వహించకపోవడం వంటి అంశాలపై నోటీసులు ఇచ్చామన్నారు. వారం రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వాలన్నారు. వివరణను అనుసరించి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. డీఎన్‌ఏవో సత్యనారాయణరాజు ఇచ్చిన తనిఖీల నివేదిక ప్రకారం నోటీసులు ఇచ్చామన్నారు.

రత్నగిరిపై పెళ్లి సందడి

అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధి శుక్రవారం రాత్రి పెళ్లి బృందాలతో నిండిపోయింది. ఎటు చూసినా వధూవరులు, వారి బంధుమిత్రులు, వివాహాలు చేయించే పురోహితులు, సన్నాయి మేళం వారు ఇలా అంతా పెళ్లిళ్లకు సంబంధించిన వారే దర్శనమిచ్చారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల ముహూర్తంలో 150కి పైగా వివాహాలు జరిగాయి. ఈ వివాహాల నిర్వహణ కోసం సత్యగిరిపై నిర్మించిన 36 వివాహ హాల్స్‌, వివిధ సత్రాలలో వివాహాలు చేసుకునే స్థలాలు, రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డు, దాని పక్కనే గల ఖాళీ ప్రదేశం అంతా పెళ్లి సందడి కనిపించింది. సత్యగిరిపై గల మట్టేవారి ఉచిత ఏసీ కల్యాణ మండపం, ఎంఎస్‌ రెడ్డి వివాహ వేదికలోని 24 చిన్న కల్యాణ మండపాల్లో కూడా ఇదే ముహూర్తంలో వివాహాలు జరిగాయి. వివాహ బృందాల వారి తాకిడితో సాధారణ భక్తులకు సత్రాలలో గదులు లభ్యం కాలేదు.

ఏపీ ఈసెట్‌–26లో

93.30 శాతం ఉత్తీర్ణత

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గత నెల 24న నిర్వహించిన ఏపీ ఈసెట్‌–26లో కాకినాడ జిల్లా 93.30 శాతం ఉత్తీర్ణత సాధించింది. జిల్లా వ్యాప్తంగా బాలురు 1,282 మంది పరీక్షకు దరఖాస్తు చేయగా 1,255 మంది హాజరయ్యారు. వీరిలో 1,176 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 681 మంది దరఖాస్తు చేయగా 669 మంది పరీక్షకు హాజరై 619 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 93.71, బాలికలు 92.53 శాతం ఉత్తీర్ణత పొందారు.

కరప మండల విద్యార్థికి 6వ ర్యాంక్‌

కరప: ఏపీ ఈసెట్‌ ఫలితాల్లో కరప మండలం వాకాడ గ్రామానికి చెందిన విద్యార్థి అడబాల లక్ష్మీ గణపతి 6వ ర్యాంక్‌ సాధించాడు. పాలిటెక్నిక్‌ డిప్లమా పూర్తిచేసిన విద్యార్థులకు బీటెక్‌ ద్వితీయ సంవత్సరం ప్రవేశాల కోసం ఏపీ ఈసెట్‌ నిర్వహిస్తారు. ఏపీ ఈసెట్‌–2026 వాకాడ గ్రా మానికి చెందిన లక్ష్మీగణపతి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 141 మా ర్కులతో 6వ ర్యాంక్‌ సాధించాడు. తండ్రి అడబా ల ప్రసాద్‌ వ్యవసాయదారుడు, తల్లి ప్రభ టైలరింగ్‌ చేస్తారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంక్‌ సాధించానని, బీటెక్‌ అనంతరం ఐఐటీలో సీటు సాధించి ఎంటెక్‌ చేసి, మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు అండగా ఉండటమే తన లక్ష్యమని ర్యాంకర్‌ లక్ష్మీగణపతి తెలిపాడు.

సంజయ్‌కు 8వ ర్యాంకు

కాకినాడ రూరల్‌: ఏపీ ఈసెట్‌ ఫలితాలలో మండలంలోని వలసపాకల సంతోష్‌నగర్‌కు చెందిన తడాల సంజయ్‌ సత్తా చాటాడు. సివిల్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్‌ సాధించాడు. సంజయ్‌ తండ్రి వీర వరహాలు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఉన్నారు. తల్లి రామలక్ష్మి గృహిణి. తమ కుమారుడు ఈసెట్‌లో ర్యాంక్‌ సాధించినందుకు తల్లిదండ్రులు అతడితో కలిసి ఆనందం పంచుకున్నారు.

ప్రశాంతంగా ఈడీ సెట్‌

రాజానగరం: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంపిక చేసిన 16 కేంద్రాలలో శుక్రవారం నిర్వహించిన ఏపీ ఈడీసెట్‌ 2026 ప్రశాంత వాతావరణంలో జరిగిందని ప్రాంతీయ సమన్వయకర్త, ఆదికవి నన్నయ యూనివర్సిటీ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.సుబ్బారావు తెలిపారు. 4,622 మంది పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా హాజరైంది మాత్రం 3,629 మంది అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement