● 12 నుంచి 20 వరకు ఆన్‌లైన్ పరీక్ష
● నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
● సెట్ చైర్మన్ ప్రసాద్ వెల్లడి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మశీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్–2026కు 3,55,009 మంది దరఖాస్తు చేసుకున్నారని సెట్ చైర్మన్ ప్రొఫెసర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు. జేఎన్‌టీయూకే వీసీ సమావేశపు హాల్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్‌టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షకు ఇంజినీరింగ్ విభాగంలో 2,75,794 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, ఫార్మశీ విభాగాల్లో 78,421 మంది, రెండు విభాగాలకూ కలిపి 794 మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. పరీక్ష మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మశీకి, మే 12 నుంచి 18వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు నిర్వహిస్తామని, ఏపీలో 142 సెంటర్లతో పాటు హైదరాబాద్‌లో ఒక ఆన్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులకు పరీక్ష కేటాయించిన తేదీన వేరే జాతీయ స్థాయి పరీక్ష ఉన్నట్లయితే వాటి ఆధారాలతో హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించాలని, ఆ వివరాలు పరిశీలించి పరీక్ష తేదీ మారుస్తామని చెప్పారు. ఉర్దూ మీడియం ఎంచుకున్న అభ్యర్థులు కర్నూల్ రీజనల్ సెంటర్‌లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. అంగవైకల్యం కలిగిన వారికి సహాయకులను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. దరఖాస్తులో ఏమైనా తప్పులు నమోదు చేస్తే పరీక్ష రాసిన తరువాత అయినా హెల్ప్‌లైన్ సెంటర్ ద్వారా మార్చుకోవచ్చని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి గంటన్నర ముందుగా ప్రవేశానికి అనుమతి ఇచ్చామని, బయో మెట్రిక్‌కు ఆటంకం లేకుండా మెహందీ వంటివి పెట్టుకోకూడదని, ఎలక్ట్రికల్ పరికరాలు వంటి వాటికి అనుమతి లేదని చెప్పారు. హాల్ టికెట్‌పై పరీక్ష కేంద్ర రూట్ మ్యాప్ ఏర్పాటు చేశామని, ముందురోజు వెళ్లి పరీక్ష కేంద్రం చూసుకోవాలని కోరారు. హాల్ టికెట్‌లు మనమిత్ర వాట్సాప్ 9552300009 నంబర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. హెల్ప్‌లైన్ కోసం 0884–2359599, 0884–2342499 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో సెట్ కన్వీనర్ మోహనరావు, ఓఎస్‌డీ కోటేశ్వరరావు పాల్గొన్నారు.


