తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా | - | Sakshi
Sakshi News home page

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నా

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

బలుసులపేటలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేసిన మహిళలు

సామర్లకోట: మున్సిపాలిటీ నుంచి గుక్కెడు నీళ్లు కూడా రావడం లేదని ధ్వజమెత్తుతూ మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం ధర్నా నిర్వహించారు. స్థానిక బలుసులపేటకు చెందిన మహిళలు మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకొని తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పీకపై కత్తి పెట్టినట్టు పన్నులు వసూలు చేశారని, మరి మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న తమకు తాగునీరు ఇవ్వవలసిన బాధ్యత లేదా అని మహిళలు ప్రశ్నించారు. గోదావరి జలాలు ఫిల్టరు చేసి ఇవ్వవలసి ఉండగా 20 రోజు లుగా బోరు నీరు ఇస్తున్నారని, దాంతో బలుసులపేటకు చెందిన పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీళ్లు కూడా బురదతో వస్తున్నాయని ధ్వజమెత్తారు. బలుసులపేట ప్రజలు అంటే అలుసుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు బకాయి ఉంటే కుళాయి కనెక్షన్లు తొలగిస్తామని బెదిరించారని, గుక్కెడు నీళ్ల కోసం రోడ్డు ఎక్కవలసి వచ్చిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎ శ్రీవిద్యకు వినతి పత్రం అందజేశారు. సమస్యను రెండు రోజులలో పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఆందోళనకు వార్డు మాజీ కౌన్సిలర్‌ నేతల హరిబాబు నాయకత్వం వహించగా పి.శాంతి, పిట్టా పాప, ఎం.కుమారి, కడారి రాజమ్మ, టి.రాణి, ఎన్‌.దివ్యభారతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement