ఇక చాలు.. దయచేయండి | - | Sakshi
Sakshi News home page

ఇక చాలు.. దయచేయండి

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026

పార్టీ ఇన్చార్జి పదవి

నుంచి తొలగించారని తెలిశాక పిఠాపురంలో విలేకర్లతో మాట్లాడుతూ

భావోద్వేగానికి

గురై నిష్క్రమిస్తున్న వర్మ

గత నెల 21న పాడా కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు (జనసేన)తో తీవ్ర వాగ్వాదానికి దిగిన వర్మ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. అధికారం కోసం జత కట్టిన టీడీపీ, జనసేన మధ్య పిఠాపురంలో ఇది ఇప్పుడు అక్షర సత్యమైంది. అధికారం దక్కే వరకూ భాయీభాయి అంటూ చెయ్యీ చెయ్యీ కలిపి కలియ తిరిగిన ఇరు పార్టీల నేతలు చాలా నెలలుగా కయ్యానికి కాలు దువ్వుతూ, కత్తులు దూసుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను ఆ పార్టీ అధిష్టానం తొలగించడం హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వర్మను హఠాత్తుగా ఆ పదవి నుంచి తప్పించడంపై ఆయన అనుచరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కూటమి గద్దెనెక్కిన తరువాత వర్మ వర్గీయులకు, జనసేన శ్రేణులకు దాదాపు రెండేళ్లుగా సాగుతున్న ఆధిపత్య పోరు తాజా సంఘటనతో తారస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది.

తరచుగా వివాదాలు

పిఠాపురం నుంచి 2014లో ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచిన వర్మ ఆ తరువాత రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జనసేన నేతలకు వర్మ ఒక పట్టాన కొరుకుడు పడటం లేదు. పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత పిఠాపురంపై పెత్తనం కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల అనంతరం పలు సందర్భాల్లో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య తీవ్ర స్థాయి వివాదాలు అనేకం జరిగాయి. కూటమిగా ఉంటూనే ఇరు వర్గాలూ ఢీ అంటే ఢీ అనే రీతిలో కయ్యానికి కాలు దువ్విన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పవన్‌ గెలుపులో తమ పార్టీ నేతల పాత్ర ఎంతో ఉందని, అందువల్లనే ఆయనకు అంత మెజారిటీ వచ్చిందని వర్మ పదేపదే చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో తమనూ భాగస్వామ్యుల్ని చేయాలని, ఆ సందర్భంగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, బ్యానర్లలో పవన్‌ కల్యాణ్‌ ఫొటోకు సమాన స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ఏర్పాటు చేయాలనే డిమాండ్లతో ఇటీవల రెండు మూడు పర్యాయాలు వర్మ, ఆయన అనుచరులు రచ్చరచ్చ చేశారు.

భూపందేరంలో మతలబు

ఈ నేపథ్యంలో వర్మను దారిలోకి తెచ్చుకునేందుకు అధిష్టానం ఇటీవల భూ పందేరాన్ని ఎరగా చూపింది. వర్మ కుమారుడి పేరిట ఉన్న కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఐదు నక్షత్రాల హోటల్‌ నిర్మాణానికి గాను కాకినాడ గర్‌ల్స్‌ పాలిటెక్నిక్‌ (జీపీటీ) సమీపాన రూ.250 కోట్ల విలువైన 3.4 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ కేటాయింపులో పెద్ద మతలబు దాగి ఉందనే చర్చ నడిచింది. భూమి అంటూ కేటాయించారు తప్ప అది ఏ సర్వే నంబర్‌లో అనే విషయాన్ని ఆ ఉత్తర్వుల్లో నిర్దిష్టంగా ప్రస్తావించ లేదు. ఇంతలోనే ఏమైందో ఏమో కానీ వర్మకు హఠాత్తుగా ఉద్వాసన పలికారు. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఇది ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని టీడీపీ సీనియర్‌ నేతలు విశ్లేషిస్తున్నారు. దీని వెనుక పై నుంచి కింది స్థాయి వరకూ జనసేన నేతల ఒత్తిళ్లున్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి అసలు ఇన్‌చార్జినే లేకుండా చేసి పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీకి అడ్రస్‌ లేకుండా చేయాలనుకుంటున్నారా అని కార్యకర్తలు నిలదీస్తున్నారు.

పొమ్మనకుండానే పొగ

సహజంగా ఇటువంటి సందర్భాల్లో ఒకింత దూకుడుగా వ్యహరించే వర్మ ఈసారి ఎందుకనో భిన్నంగా ప్రతిస్పందించడం టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పైపెచ్చు మంత్రి లోకేష్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ తనతో చర్చించాకనే ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించే నిర్ణయం జరిగిందని ఆయన చెప్పుకు రావడం గమనార్హం. ఇప్పటి వరకూ వర్మ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ జంట పదవులతో భారమవుతోందని, ఈ విషయం చెప్పి, ఒక బాధ్యత నుంచి తప్పించాల్సిందిగా తనకు తానుగానే అభ్యర్థించానని చెప్పుకొచ్చారు. ఈ విషయాల్లో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ.. ఎప్పటి నుంచో ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించడమంటే.. పార్టీ నుంచి పొమ్మనకుండానే పొగబెట్టడం వంటిదేనని తెలుగు తమ్ముళ్లు విశ్లేషించుకుంటున్నారు. పార్టీ వ్యవహారాల్లో ఇదివరకు ఎప్పుడూ ఇటువంటి విధానాలు చూడలేదని సీనియర్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై తగిన కార్యచరణ కోసం వర్మ వర్గీయులు సమాయత్తమవుతున్నారు.

ఎమ్మెల్సీ పదవి ఆశ చూపి జెల్ల

గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం సీటును పొత్తులో భాగంగా జనసేనకు చంద్రబాబు కేటాయించారు. పవన్‌ కల్యాణ్‌ కోసం ఈ సీటును త్యాగం చేసిన వర్మకే.. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఎమ్మెల్సీ పదవి కట్టబెడతామని బహిరంగంగానే మాట ఇచ్చారు. రెండేళ్లుగా ఎంతో మందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. చివరకు పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబుకు సైతం ఈ పదవి కట్టబెట్టారు. కానీ వర్మకు మాత్రం మొండిచేయి చూపుతూనే వచ్చారు. ఇలా అధినేత చంద్రబాబే ఇచ్చిన మాట తప్పడంతో వర్మ వర్గీయులు తొలి నుంచీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి నుంచి వర్మ తొలగింపు

టీడీపీ అధిష్టానం నిర్ణయం

వర్మ వర్గానికి

అవమాన భారం

జనసేన ఒత్తిళ్లే కారణమా!

తెలుగు తమ్ముళ్ల

అంతర్మధనం

Advertisement
 
Advertisement
Advertisement