కలకలం రేపిన విషాహారం | - | Sakshi
Sakshi News home page

కలకలం రేపిన విషాహారం

May 8 2026 12:25 PM | Updated on May 8 2026 12:25 PM

కొత్తపేట ఆస్పత్రిలో చికిత్స

పొందుతున్న బాధితులు

నేతలు, అధికారుల పరామర్శ

కొత్తపేట: ఫుడ్‌ పాయిజన్‌తో సుమారు 50 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటన కొత్తపేట మండలంలో కలకలం రేపింది. వివాహ విందులో మిగిలిపోయిన ఆహారాన్ని రెండో పూట, కొందరు మూడో పూట కూడా తిని అస్వస్థతకు గురైన ఘటన వానపల్లి శివారు రామమోహనరావుపేటలో చోటు చేసుకుంది. డీఎంహెచ్‌ఓ డి.దొర, తహసీల్దార్‌ వై.రాంబాబు తక్షణ చర్యలు తీసుకుని బాధితులను కొత్తపేట సీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందేలా చేశారు.

బాధితుల్లో 11 మంది చిన్నారులు

ఆ గ్రామంలో ఇంకా పలువురు అస్వస్థతకు గురైన విషయాన్ని డీఎంహెచ్‌ఓ దొరకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆయన 108 జిల్లా ఇన్‌చార్జ్‌ వెంకటేష్‌ను అప్రమత్తం చేసి జిల్లాలోని అంబులెన్స్‌లను రామమోహనరావుపేటకు పంపించాలని సూచించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి 15 అంబులెన్స్‌లు రాగా వాటిలో 42 మందిని కొత్తపేట సీహెచ్‌సీకి తరలించారు. వారిలో వానపల్లి రామమోహనరావుపేటకు చెందిన వారు 37 మంది కాగా మిగిలిన ఐదుగురు మోడేకుర్రుకు చెందిన వారు. మొత్తం బాధితుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. వారికి ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది వానపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శివ వైద్య సేవలు అందించారు. జాయింట్‌ కలెక్టర్‌ నిడియాదేవి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.

మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పరామర్శ

ఫుడ్‌ పాయిజన్‌తో వానపల్లి వాసులు అస్వస్థతకు గురయ్యారన్న సమాచారంతో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట ఆస్పత్రికి వచ్చి రోగులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అన్ని వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్‌ఓ దొర, ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. అవసరమైతే వైఎస్సార్‌ సీపీ తరఫున తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి డేవిడ్‌రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ముసునూరి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల వీరభద్రరావు, జిల్లా పార్టీ నాయకుడు సాకా జానకి రామరాజు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement