● మాసూళ్లు పూర్తవగానే
ఖరీఫ్ సాగు చేపట్టాలి
● రైతులకు జేడీఏ సూచన
కరప: గోదావరి డెల్టా కాలువలకు ఈ నెల 15వ తేదీ నుంచి నీరు విడుదల చేస్తారని, అందువలన రబీ మాసూళ్లు పూర్తయిన వెంటనే ఖరీఫ్ సాగు చేపట్టాలని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు (జేడీఏ) ఎన్.విజయ్ కుమార్ అన్నారు. గొడ్డటిపాలెం రైతు సేవా కేంద్రంలో గురువారం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తు సాగు వల్ల తొలకరి సీజన్ చివరిలో వచ్చే తుపాన్ల గండం నుంచి బయటపడి, పంటను దక్కించుకోవచ్చని రైతులకు సూచించారు. మూడో పంటగా అపరాల సాగుకు అవకాశం ఉంటుందని, దీనివలన తక్కువ పెట్టుబడితో అదనపు ఆదాయం సమకూరుతుందని అన్నారు. తొలకరి నారుమళ్లు, వెదజల్లు పద్ధతి అనుసరించేవారు జూన్ నెలాఖరుకల్లా పూర్తి చేయాలన్నారు. వేసవి ఉష్ణోగ్రతలు, ఎల్‌నినో ప్రభావం నుంచి పంటను దక్కించుకోవడానికి దాళ్వా కోతలు పూర్తి చేసిన ప్రతి పొలంలో పీఎండీఎస్ విత్తనాలు జల్లేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అరట్లకట్ట, గొడ్డటిపాలెం గ్రామాలకు పంట కాలువ ద్వారా సాగునీరు రాకుండా ఎగువ రైతులు అడ్డుకుంటున్నారని, దీంతో తమ పొలాలకు సకాలంలో నీరందక, వరి నాట్లు ఆలస్యమవుతున్నాయని ఆయా గ్రామాల రైతులు చెప్పారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి, ఈ సమస్య తలెత్తకుండా చూస్తామని విజయ్ కుమార్ హామీ ఇచ్చారు. అనంతరం, ఆయన కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. తేమ శాతం, తప్ప, తాలు గింజల శాతం పేరుతో ఎవరైనా మద్దతు ధరలో కోత పెట్టినా, రైస్ మిల్లుల నుంచి సమస్యలు ఎదురైనా మిల్లుల వద్ద ఉండే కస్టోడియన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో కరప, కాకినాడ వ్యవసాయ సబ్ డివిజన్ల ఏడీఏలు వి.అశోక్ (ఇన్‌చార్జి), దుర్గాలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి ఇమ్మిడిశెట్టి సత్య తదితరులు పాల్గొన్నారు.


