● ఏ పంటకూ మద్దతు ధర దక్కడం లేదు
● మొక్క జొన్న, పొగాకు
రైతుల కష్టాలు వర్ణనాతీతం
● వైఎస్సార్ సీపీ రైతు విభాగం
రాష్ట్ర అధ్యక్షుడు బాబి
అమలాపురం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం రైతులను, వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో ఏ పంటలకూ మద్దతు ధరలు దక్కడం లేదని ఆరోపించారు. అమలాపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత సంవత్సరం టమాటా, మొక్కజొన్న, పొగాకు, శనగ, కోకో, అరటి, మామిడి, సజ్జ ఇలా ఏ పంటకూ మద్దతు ధర ఇవ్వలేదన్నారు. మొక్కజొన్న మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400 దక్కాలి. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.1,400, రూ.1,600కు రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారని చెప్పారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధరను ఆ ప్రభుత్వాలు ఇస్తున్నాయని బాబీ చెప్పారు. ఎంతసేపూ మాది ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ పాలన అంటూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడమే తప్ప రైతులను ఆదుకోవడంలో మాత్రం వెనుకబాటులో ఉన్నారని విమర్శించారు. పొగాకు మద్దతు ధర కోసం ఇబ్బందులపై గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లిలో రైతులు ధర్నా చేశారన్నారు. కేజీ పొగాకుకు రూ.265 కూడా రావడం లేదని చెప్పారు. అదే గత సంవత్సరం రూ.450 ఉందన్నారు. మొక్కజొన్న, పొగాకు రైతులు కష్టనష్టాలు వర్ణనాతీతమని బాబీ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకులు బ్లాక్ మార్కెట్ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. పొగాకు నుంచి మొన్నటి ఎరువులు, నిన్నటి డీజిల్ కొరత వరకూ కొందరు కూటమి నేతలు దళారులై కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని చెప్పారు. అమరావతి పనులకు డీజిల్ సమృద్ధిగా ఇవ్వాలని ఆయిల్ కంపెనీలకు లేఖలు రాసి కాంట్రాక్టర్ల కొమ్ము కాసిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదని బాబీ విమర్శించారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి పంటకూ మద్దతు ధర ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో కూడా గ్రామాలకు వాహనాలను పంపించి ఆయా పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించిన ఘటనలను గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తూ ధరల స్థిరీకరణ వాగ్దానాన్ని విస్మరించిందని బాబీ విమర్శించారు.


