కట్టెయ్యాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

కట్టెయ్యాల్సిందే!

May 7 2026 8:14 AM | Updated on May 7 2026 8:14 AM

తుని/రాయవరం: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన అనంతరం పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచే యోచనేదీ లేదని చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను భారీగా పెంచేసింది. ఇప్పటికే సిలిండర్ల కొరతతో సతమతమవుతున్న హోటల్‌ రంగంపై ధరల పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యాపారం మూసేసుకోవాల్సిందేనని హోటళ్ల యజమానులు వాపోతున్నారు. మొన్నటి వరకూ రూ.2,350గా ఉన్న కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్రం ఒకేసారి రూ.993 మేర పెంచేసింది. దీంతో, 19 కిలోల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర ఒక్కసారిగా రూ.3,343కు పెరిగింది. వాస్తవానికి జనవరి నుంచి కమర్షియల్‌ గ్యాస్‌ ధరను కేంద్రం పెంచుతూనే ఉంది. జనవరి 1న రూ.111, ఫిబ్రవరి 1న రూ.50, మార్చి 1న రూ.31, మార్చి 7న రూ.115, ఏప్రిల్‌ 1న రూ.218 చొప్పున పెంచగా.. ఈ నెల 1న ఏకంగా రూ.993 మేర బాదేసింది. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1,518 పెరగడంతో చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. యుద్ధ ప్రభావంతో ధరలు పెరుగుతాయనే అంచనాలున్నా.. ఇంత భారీగా పెంచేస్తారని ఊహించలేదని అంటున్నారు. ఇప్పటికే సిలిండర్ల కొరతతో నెట్టుకొస్తున్న తమపై పెరిగిన కమర్షియల్‌ సిలిండర్‌ ధర మరింత భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.

మూసివేత దిశగా..

పట్టణాలు, నగరాల్లో టీ స్టాల్స్‌, టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు, బడ్డీలు, ధాబాలు, స్వీట్‌ షాపులు, చాట్‌ సెంటర్లు, చిన్న చిన్న బిర్యానీ, భోజన హోటళ్లు, బేకరీల్లో వివిధ వంటకాలు, ఆహార పదార్థాల తయారీకి వంట గ్యాస్‌ తప్పనిసరి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 200 గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లున్నాయి. కమర్షియల్‌ గ్యాస్‌ కనెక్షన్లు తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 5 వేలు, కాకినాడ జిల్లాలో 20 వేలు, కోనసీమ జిల్లాలో 1,400 వరకూ ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో రోజుకు దాదాపు 10 వేల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల వినియోగం ఉండేది. కమర్షియల్‌ గ్యాస్‌ ధరను ప్రభుత్వం పెంచేయడంతో ఆయా ఏజెన్సీల్లో వీటి బుకింగ్‌లు గణనీయంగా పడిపోయాయని నిర్వాహకులు చెబుతున్నారు. తుని నియోజకవర్గంలోని తుని పట్టణం, తుని, తొండంగి, కోటనందూరు మండలాల్లో 7 గ్యాస్‌ ఏజెన్సీలున్నాయి. వీటిలో డొమెస్టిక్‌ 1.30 లక్షలు, కమర్షియల్‌ 931 కనెక్షన్లు ఉన్నాయి. ఇక్కడ కూడా కమర్షియల్‌ సిలిండర్ల బుకింగ్‌లది అదే పరిస్థితి.

ప్రజల పైనే భారం

కమర్షియల్‌ గ్యాస్‌ ధర పెంపు ప్రభావం నేరుగా హోటళ్లపై పడినప్పటికీ.. పరోక్షంగా ఆ భారాన్ని ప్రజలే భరించాల్సి వస్తోంది. ఇప్పటికే హోటళ్లలో టిఫిన్ల రేట్లు పెంచేశారు. నాలుగు ఇడ్లీల ధర గతంలో రూ.20 ఉంటే ప్రస్తుతం ఆ రేటుకు 3 ఇడ్లీలే ఇస్తున్నారు. ఇంకా, పూరీ, బజ్జీ, దోశ వంటి అన్ని రకాల టిఫిన్ల రేట్లు దాదాపు రెట్టింపయ్యాయి. ఇది కూడా గిట్టుబాటు కావడం లేదని, గ్యాస్‌ ధర భారం మోయలేక వ్యాపారాలు నిర్వహించలేకపోతున్నామని, ఇలాగైతే కొట్టు కట్టేయాల్సిందేనని వ్యాపారులు వాపోతున్నారు. డొమెస్టిక్‌ సిలిండర్లు వినియోగిస్తే పౌర సరఫరాల శాఖ అధికారులు కేసులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని టిఫిన్‌ సెంటర్లు, ధాబాలను మూసివేశారు. మరికొన్ని అదే బాటలో పయనిస్తున్నాయి. ఫలితంగా వాటిల్లో పని చేస్తున్న కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. పెద్ద హోటళ్ల యజమానులు సైతం గ్యాస్‌ ధర పెంపుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టిఫిన్ల ధర పెంపుతో ఆన్‌లైన్‌ ఆర్డర్లు కూడా తగ్గుతున్నాయని చెబుతున్నారు.

కట్టెలకూ ధరల మంట

కొంత మంది చిన్న, మధ్యతరహా హోటళ్ల యజమానులు గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా కట్టెలు వాడుతున్నారు. దీంతో, వాటి ధరలకు కూడా రెక్కలొచ్చాయి. గతంలో 25 కేజీల వంట చెరకు ధర రూ.170 ఉండగా, గ్యాస్‌ కొరత ప్రారంభమైన తర్వాత అది రూ.225కు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.

ఫ హోటళ్లపై కమర్షియల్‌

గ్యాస్‌ ధరాభారం

ఫ ఒకేసారి రూ.993 మేర బాదేసిన కేంద్రం

ఫ ఇప్పటికే మూత పడుతున్న టిఫిన్‌ సెంటర్లు

ఫ ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని యజమానుల డిమాండ్‌

ధాబా మూసేశాం

మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉంది. ధాబాలు, హోటళ్లలో టిఫిన్లు, ఆహార పదార్థాల ధరలు పెంచితే కస్టమర్లు రావడం లేదు. వ్యాపారం అంతంత మాత్రంగానే ఉన్న ఈ సమయంలో గ్యాస్‌ ధర రెట్టింపు పెరగడంతో ధాబాను మూసేశాం. నలుగురు కార్మికులు పని చేసేవారు. వారు ఉపాధి కోల్పోయారు.

– నాగేశ్వరరావు, ధాబా యజమాని, తుని

గిట్టుబాటు కావడం లేదు

ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం హోటల్‌ నిర్వహిస్తున్నాను. గ్యాస్‌ ధర పెరగడంతో ఉదయం టిఫిన్లు ఆపేశాను. టిఫిన్‌ రేట్లు పెంచితే కస్టమర్లు దూరమవుతున్నారు. పెంచకపోతే నిర్వహణ కష్టమవుతోంది. భోజనం ధరలు పెంచాల్సి వచ్చింది.

– అనపర్తి జయకృష్ణ, రెస్టారెంట్‌ యజమాని, రాయవరం

కట్టెల పొయ్యిలే దిక్కు

గ్యాస్‌ ధర పెంపు, కొరత కారణంగా ప్రస్తుతం కట్టెల పొయ్యిల పైనే వంట చేయాల్సి వస్తోంది. స్వల్పంగా ధరలు పెంచి, అతి కష్టం మీద నిర్వహిస్తున్నాం.

– వి.రాజేష్‌, హోటల్‌ నిర్వాహకుడు, రాయవరం

Advertisement
 
Advertisement
Advertisement