బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): భవన నిర్మాణ కార్మికులకు 9 సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఐటీయూ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ బుల్లిరాణికి వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చెక్కల రాజ్‌కుమార్ మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుని కుమార్తె వివాహ బహుమతిగా రూ.40 వేలు చెల్లించేలా కార్మిక శాఖకు ఆదేశాలివ్వాలని కోరారు. పథకాలు పొందేందుకు కార్మిక శాఖ అధికారులు స్థానిక కార్యాలయాల్లో నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందుకు వీలుగా ఖాళీ పోస్టులను తక్షణం భర్తీ చేయాలని, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బకాయి పెట్టిన రూ.5 కోట్లు కార్మికుల కుటుంబాలకు చెల్లించాలని, 2020 నాటి గుర్తింపు కార్డులను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆకుల సత్యనారాయణ, వై.సత్యనారాయణ, పప్పుల వీరబాబు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.


