అన్నవరం: రత్నగిరికి బుధవారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోను మంగళవారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధువులు, మిత్రులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది స్వామివారి దర్శనానికి రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. నవ దంపతులను అంతరాలయ దర్శనానికి అనుమతించారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. వివాహాల కారణంగా రత్నగిరిపై ఆదివారం వరకూ భక్తుల రద్దీ కొనసాగనుంది.
ఇంటర్ సప్లిమెంటరీకి
పటిష్ట ఏర్పాట్లు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాధ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21 నుంచి జూన్ 4 వరకూ జరగనున్న ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 40 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 24,072 మంది హాజరు కానున్నారని చెప్పారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.


